ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని నారాయణ నివాసానికి మంగళవారం ఉదయం ఏపీ సీఐడీ పోలీసులు వచ్చారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. ఏ కేసులో నారాయణను అదుపులోకి తీసుకున్నారనే విషయాన్ని ఏపీ పోలీసులు మీడియాకు వెల్లడించలేదు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టెన్త్ ఎగ్జామ్స్ తెలుగు పేపర్ లీకైన సంగతి తెలిసిందే. తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచ్ నుంచి తెలుగు ప్రశ్నాపత్రం లీకైనట్లు పోలీసులు గుర్తించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఉదయం 9:57 గంటలకు వాట్సాప్‌లో తెలుగు పేపర్ వైరల్ అయింది. నారాయణ విద్యాసంస్థలో పని చేస్తున్న గిరిధర్ వాట్సాప్ నుంచి తెలుగు ప్రశ్నాపత్రం లీకైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులోనే మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.