కరోనా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ఇప్పటికీ వివిధ వేరియంట్ల రూపంలో తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. దీనిని అరికట్టేందుకు తీసుకొచ్చిన టీకాలు ప్రాణాపాయ ముప్పును తప్పిస్తున్నాయి. అయితే వాటి సమర్థతపై నేటికీ సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా ప్రజల్లో ఉన్న అనుమానాలను పటాపంచలు చేసేలా శాస్త్రవేత్తలు కొత్త టీకాను అభివృద్ధి చేశారు. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అడినోవైరస్‌ను వాహకంగా చేసుకుని కొత్త టీకాను రూపొందించారు. నోటి ద్వారా తీసుకునే ఈ టీకాతో కరోనా బాధితులకు మహమ్మారి నుంచి మెరుగైన రక్షణ కల్పిస్తుంది. వ్యాధిగ్రస్తుల నుంచి ఇతరులకు సోకకుండా నిలువరిస్తుంది. బాధితులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్లలో అధిక సంఖ్యలో వైరస్ గాలిలోకి వెళ్తుంది. దీనికి కూడా తాజా టీకా అడ్డుకట్ట వేస్తుంది.
వ్యాక్సిన్‌తో ట్యాబ్లెట్ రూపంలోనూ శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు. రక్తంలో సమర్థవంతమైన యాంటీబాడీలను ఇది ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఊపిరితిత్తులలో వ్యాధి తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుంది. చేతికి చేసే ఇంజక్షన్ల ద్వారా శరీరంలోకి వెళ్లే వ్యాక్సిన్ల కంటే తాజా వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతమైన పనితీరును కనబర్చినట్లు పరిశోధకులు చెబుతున్నారు. మిగిలిన టీకాల కంటే ఈ టీకా ‘ఇమ్యునోగ్లోబ్యులిన్-ఎ(ఐజీ-ఎ)’ను అధికమొత్తంలో విడుదల చేస్తుందని తేలింది. ఫలితంగా వ్యాధిగ్రస్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్లలో వైరస్‌ల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.