ఏడాది వ్యవధిలోగా పొలాల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో భాగంగా తాజా ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సంస్కరణలు ఏపీలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా సాగు బోర్లకు విద్యుత్ మీటర్లను ఏపీ సర్కారు పెడుతోంది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో ఈ ప్రక్రియ చేపట్టింది. దీని వల్ల 30 శాతం విద్యుత్ ఆదా అవుతుందని సీఎం జగన్ ఇటీవల స్వయంగా ప్రకటించారు. దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి తాజా ఉత్తర్వులు అందజేశారు.
2023 జూన్ నాటికి ఏపీ మొత్తం సాగు బోర్లకు స్మార్ట్‌మీటర్లు బిగించాలనేది తమ లక్ష్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. నిర్ణీత గడువులోగా లక్ష్యం పూర్తవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ విద్యుత్ సంస్కరణలపై ప్రతిపక్షాలతో పాటు పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులు కుదేలవుతారని వారు విమర్శిస్తున్నారు. అయితే దీని వల్ల ప్రయోజనాలున్నాయని, అందుకే తాము అమలు చేస్తున్నామని ఏపీ సర్కారు చెబుతోంది.