ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై చెన్నై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ దేవాన్ కాన్వే.. తనను ఆస్ట్రేలియా గొప్ప క్రికెటర్లలో ఒకరు, సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సేతో పోల్చడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ క్రికెటర్ అయిన కాన్వే ఐపీఎల్ 2022 లీగ్ కోసం సీఎస్కేతో చేరాడు. ఐపీఎల్ అనే కాకుండా ప్రపంచ క్రికెట్ లో ఎంతో పేరు, అనుభవం కలిగిన మైక్ హస్సేతో తనను పోల్చడం ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తున్నట్టు కాన్వే చెప్పాడు.
ఒక క్రికెటర్ గా హస్సేతో మాట్లాడడం, ఆయన నుంచి నేర్చుకోవడం, కష్టపడి పనిచేయడం తనకు ఎంతో ముఖ్యమైనదిగా దేవాన్ కాన్వే పేర్కొన్నాడు. ఆదివారం ఢిల్లీ జట్టును సీఎస్కే 91 పరుగుల తేడాతో ఓడించడం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు సాధించింది. ఇందులో ఓపెనర్ గా వచ్చిన దేవాన్ కాన్వే 49 బంతులను ఎదుర్కొని 87 పరుగులు సాధించాడు.
‘‘నాకు ఇచ్చిన ఏ అవకాశాన్ని అయినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని నన్ను నేను నిరూపించుకోవాలి. దక్షిణాఫ్రికాకు వెళ్లి వివాహం చేసుకుని రావడం నా అదృష్టం. ఈ సమయంలో జట్టు నుంచి నాకు లభించిన మద్దతుకు సంతోషంగా ఉంది’’ అని కాన్వే పేర్కొన్నాడు. ఏప్రిల్ లో కాన్వే వివాహం అతని గర్ల్ ఫ్రెండ్ కిమ్ వాట్సన్ తో జరిగింది. ఆ సమయంలో బయోబబుల్ నుంచి వెళ్లిన అతడు, వివాహం తర్వాత వచ్చి చేరాడు. ఓపెనర్ గా సత్తా చాటుతున్నాడు.