ఏపీలోని పరిశ్రమలకు ఏప్రిల్ 8 నుంచి విధించిన పవర్ హాలిడేను ఎత్తివేసినట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం కారణంగా ఏర్పడిన విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమలకు పవర్ హాలిడే విధించిన విషయం తెలిసిందే. పరిశ్రమలపై విద్యుత్ ఆంక్షలను మరోసారి సడలిస్తూ వారంలో అన్ని రోజుల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేసిందని మంత్రి చెప్పారు.
నిరంతరం విద్యుత్ వినియోగించే పరిశ్రమలు ఉ.9 నుంచి సా.6 గంటల వరకు రోజు వారీ డిమాండ్ లో 70 శాతం విద్యుత్ ను వినియోగించు కోవడానికి అనుమతించిందని తెలిపారు. మిగతా సమయంలో 50 శాతం వినియోగించుకోవచ్చన్నారు. ఈ నిబంధనలు మంగళవారం నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు.