శరీరం సరిగా పనిచేయాలంటే ఎముకలు బలంగా ఉండాలి. ఎముకలు బలంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి.. ఈ వేసవిలో దొరికే కొన్ని సీజనల్ పండ్లను తినడం ద్వారా కూడా ఎముకల దృఢత్వాన్ని పెంచుకోవచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పైనాపిల్: పైనాపిల్ లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని యాసిడ్ లోడ్ ను నియంత్రిస్తుంది. కాల్షియం లోటును తగ్గిస్తుంది. పైనాపిల్‌లో విటమిన్ ఏ, కాల్షియం కూడా అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి దోహదపడుతాయి.
స్ట్రాబెర్రీ: స్ట్రాబెర్రీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఎముకలు గుల్లగా మారడాన్ని అడ్డుకుంటాయి. స్ట్రాబెర్రీలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కే, విటమిన్ సీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.
యాపిల్: ప్రతిరోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం రాదని అంటారు. ఎముకలు బలంగా ఉండేందుకు, కొత్త ఎముక కణాలు ఉత్పత్తి అయ్యేందుకు దోహదపడే విటమిన్ సీ యాపిల్ లో పుష్కలంగా లభిస్తుంది.
బొప్పాయి: బొప్పాయి ఎముకలను దృఢంగా చేసేందుకు ఉపయోగపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్ సీ ఇందులో పుష్కలంగా లభిస్తుంది. బొప్పాయి తింటే చర్మం నిగనిగలాడుతుంది. అలాగే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
టమాటా: టమాటాల్లో విటమిన్ కే, కాల్షియం, లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఎముకల బలానికి ఇవి ఉపయోగపడతాయి.