ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారదర్శకంగా ఉండండి, ప్రజలకు న్యాయం చేయండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 12, 2022, 04:53 PM

సివిల్ సర్వీసు అధికారులు దేశం గురించి ఆలోచించాలని, భారతదేశ రాజ్యాంగ నిబంధనలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడవలసిన బాధ్యత వారిదేనని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవాలని, భారత రాజ్యాంగం పౌరులందరికీ చట్టం ముందు సమానత్వం, సమాన రక్షణను కల్పించిందన్నారు. విజయవాడ రాజ్‌భవన్‌ దర్బార్ హాల్‌ వేదికగా శిక్షణలో ఉన్న ఐఎఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులతో గవర్నర్ గురువారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించిన 2020 బ్యాచ్‌కు చెందిన పది మంది ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారులు, రాష్ట్రంలో శిక్షణ పొందుతున్న ఇద్దరు ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) ప్రొబేషనరీ అధికారులు గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారికి దిశా నిర్దేశం చేసిన గవర్నర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత ఐఎఎస్ అధికారులపై ఉందన్నారు.


వివక్షకు తావు లేకుండా అర్హులను గుర్తించేలా చర్యలు తీసుకోవాలని, సమాజంలోని అణగారిన ప్రజలు నిర్లక్ష్యానికి గురి కాకుండా చూడటమే అధికారుల ప్రధమ కర్తవ్యం అన్నారు. అధికారులు సాధ్యమైనంత వరకు అయా పరిస్ధితులకు అనుగుణంగా నిజాయితీతో కూడిన నిర్ణయాలను వెలువరించాలని, పేదలకు సహాయం చేయడంలో స్వతంత్రంగా ఆలోచనలు చేయాలని, అదే జీవితానికి తృప్తినిస్తుందని గవర్నర్ హరిచందన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ జె. శ్యామలరావు మాట్లాడుతూ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారులు తమకు కేటాయించిన జిల్లాల్లో వివిధ స్థాయిల్లో ఒక సంవత్సరం శిక్షణ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఏపీ సెక్రటేరియట్‌కు అనుబంధం అయ్యారని గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, సహాయ కార్యదర్శి సన్యాసిరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com