వివాదాస్పద, స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కొన్ని రోజులుగా ఆయన చనిపోయాడంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆ వ్యతిరేక ప్రచారంపై ఆయన ఉలిక్కి పడ్డారు. చివరికి తాను బ్రతికే ఉన్నానంటూ స్వయంగా ప్రకటించాల్సి వచ్చింది. గురువారం తన ఫేస్‌బుక్ ఖాతాలో దీనికి సంబంధించి స్పష్టత ఇచ్చేలా పోస్ట్ చేేశారు. తాను చనిపోలేదని, కేవలం సమాధిలోకి వెళ్లానని ఆయన ప్రకటించాడు. తనను ద్వేషించే వ్యక్తులు తాను ఇప్పటికే చనిపోయానని పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని పేర్కొన్నాడు. తాను చనిపోలేదని శిష్యులకు చెప్పాలనుకునేందుకే సోషల్ మీడియా ద్వారా స్పష్టత ఇస్తున్నట్లు చెప్పాడు. తనకు 27 మంది వైద్యులతో కూడిన బృందం చికిత్స అందిస్తున్నట్లు వివరించాడు.
ప్రస్తుతం ఈక్వెడార్ తీరంలో 'కైలాస' అని నామకరణం చేయబడిన ద్వీపంలో స్వామి నిత్యానంద నివసిస్తున్నాడు. ఈ ఆధ్యాత్మిక గురువుపై భారతదేశంలో అనేక కేసులు నమోదయ్యాయి. ఇక క్రమం తప్పకుండా ఫేస్‌బుక్ ద్వారా తన శిష్యులతో టచ్‌లో ఉంటాడాయన. ఆయన నివసిస్తున్న కైలాసానికి సంబంధించిన చాలా విషయాలు అత్యంత రహస్యంగానే ఉన్నాయి. ద్వీపం అధికారిక వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడిన ఫుటేజీనీ రికార్డ్ చేశారని తెలుస్తోంది. ఇక ఆయన ప్రకటించిన దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. వీటిపైనా నెటిజన్లు తమదైన రీతిలో ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.