దేశ రాజకీయాల్లో మరలా పునర్వైభవం సాధించాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అధికారం కోల్పోయి, కుదేలైన పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో భారీ కుదుపు చోటు చేసుకుంది. రాష్ట పీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ కీలక నేత సునీల్ జకార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఓ పక్క రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ వేదికగా పార్టీ మేధో మథన సదస్సు 'చింతన్ శిబిర్' జరుగుతుండగానే పార్టీకి ఆయన షాక్ ఇచ్చారు. ఫేస్ బుక్ లైవ్ ద్వారా తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 'గుడ్ లక్ , గుడ్ బై కాంగ్రెస్' అని పార్టీకి తన సందేశం పంపారు.
రాజీనామా చేసిన క్రమంలో పార్టీ అగ్రనేతలపై సునీల్ జకార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దుస్థితికి ఢిల్లీలో కూర్చున్నోళ్ల వారే కారణమని వ్యాఖ్యానించారు. పార్టీకి చేటు చేసే సైకోపాత్‌ల పట్ల అగ్రనాయకత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీ ఎంపీ అంబికా సోని చేసిన హిందూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. మరోవైపు పంజాబ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమికి మాజీ ముఖ్యమంత్రి చన్నీ కూడా కారణమంటూ మండిపడ్డారు. పార్టీని గాడిలో పెట్టాలని చివరగా పార్టీ అధిష్టానానికి సూచించారు. ఇక గతంలో సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత ఆ పదవిపై సునీల్ జకార్ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయనను కాదని, దళిత సీఎం అనే పేరుతో చన్నీకి కాంగ్రెస్ అధిష్టానం పదవి కట్టబెట్టింది. ఆ సమయంలో అధిష్టానంపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. క్రమశిక్షణా సంఘం ఆయనపై చర్యలు తీసుకోవడంతో, అది నచ్చక పార్టీకి సునీల్ జకార్ రాజీనామా చేశారు.