ఈనెల 16న గణపవరంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా, గణపవరంలో పర్యటించనున్నారు. వైయస్ఆర్ రైతు భరోసా పథకంలో రైతులకు సీఎం చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటన కోసం ఇప్పటికే హెలిప్యాడ్ నిర్మాణం పూర్తికావచ్చింది. హెలికాప్టర్ ట్రయల్‌రన్ పూర్తిచేశారు. హెలిప్యాడ్ నుంచి ముఖ్యమంత్రి ప్రత్యేక వాహనశ్రేణిలో నేరుగా సభాస్థలికి చేరుకుంటారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో భారీ సభావేదికను నిర్మిస్తున్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు, మంత్రులు, రాçష్ట్రస్థాయి నాయకులు, అధికారులు కూర్చునే విధంగా సువిశాలమైన సభావేదికను నిర్మిస్తున్నారు. సభలో పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొననున్న దృష్ట్యా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభాప్రాంగణానికి రావడానికి ప్రజలు ఇబ్బంది పడకుండా ఐదు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే సభావేదిక నిర్మాణ పనులను శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, జాయింట్ కలెక్టర్ అరుణ్‌బాబు పరిశీలించారు. సభకు తరలివచ్చే రైతులు, ప్రజలకు సిట్టింగ్ ఏర్పాటుపై చర్చించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ పరిశీలించారు.