త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు. దీంతో బీజేపీ అధిష్టానం ఈ పరిణామంపై దృష్టి సారించింది. కాసేపటిలో కొత్త ముఖ్యమంత్రిని పార్టీ ఎంపిక చేయనుంది. బీజేపీ ఎమ్మెల్యేల నుంచి త్రిపురకు కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేలను త్రిపురకు పంపించారు. "పార్టీ అన్నింటికంటే ఉన్నతమైనది, నేను ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో పార్టీ కోసం పనిచేశాను. పార్టీ రాష్ట్ర శాఖాధిపతిగా, ముఖ్యమంత్రిగా త్రిపుర ప్రజలకు న్యాయం చేయడానికి నేను ప్రయత్నించాను" అని రాజీనామా తర్వాత విప్లవ్ కుమార్ దేవ్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన మరుసటి రోజే విప్లవ్ కుమార్ దేవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.