రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్తూ ప్రజల ఆశీర్వాదం పొందుతున్నాం. అలా ఇళ్లకు ఊర్కే వెళ్లకుండా, ఈ ప్రభుత్వం వారికి ఏమేం చేసిందో చెప్పే విధంగా, ‘మూడో ఏట సంక్షేమ బావుటా’ అన్న బుక్లెట్ కూడా ఇస్తున్నాం. దానిపై వారి పేరు కూడా ఉంటుంది. వారికి ఈ మూడేళ్లలో ఏయే పథకంలో ఏమేం అందాయన్న వివరాలు ఉంటాయి. అదే సమయంలో ఈ మూడేళ్లు మేమేం చేశామన్నది స్పష్టంగా ప్రచురించి ఇస్తున్నామని చెప్పారు. ఆదివారం తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నామని చెబుతూ, అవి అందాయా లేదా అని అడిగిన ప్రభుత్వం ఈ దేశంలోనే కాదు, బహుషా ప్రపంచంలోనే ఉండదేమో. ఒక్క జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తప్ప. ఇంత వరకు ప్రజాస్వామ్య చరిత్రలో ఏ ఒక్క రాజకీయ పార్టీ తాను ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టోను ఇంటింటికీ వెళ్లి ఇవి అమలు చేశామా? లేదా? అని అడిగిన దాఖలా ఎక్కడా లేదు అని అన్నారు.