దేశవ్యాప్తంగా 'పుష్ప' కలెక్షన్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాలో డైలాగులు, డ్యాన్సులు అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే, అందులో చూపించిన ఎర్రచందనం స్మగ్లింగ్ సీన్లు ముక్కున వేలేసుకునేలా చేశాయి. ఎర్రచందనం ఉన్న లారీని ఏ మాత్రం అనుమానం రాకుండా ఓ బావిలో ముంచేసిన సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే తరహాలో కొందరు గంజాయి స్మగర్లు తెలివిగా ప్లాన్ చేశారు. పోలీసులను సైతం అవాక్కయ్యేలా చేసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని అల్లూరి జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో మారేడుమిల్లి వద్ద పోలీసులు స్పెషల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. చెక్ పోస్టును దూరం నుంచే చూసిన స్మగ్లర్లు తాము ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనాన్ని వేగం మరింత పెంచారు. చెక్ పోస్టు వద్ద పోలీసులను తప్పించుకుని కారును ముందుకు పోనిచ్చారు. పోలీసులు వారిని వాహనాలలో వెంబడించడంతో గంజాయితో ఉన్న కారును రంపచోడవరం మండలం భూపతిపాలెం రిజర్వాయరులోనికి పోనిచ్చారు. కారు పూర్తిగా మునిగిపోయిన తర్వాత అక్కడి నుంచి జారుకున్నారు. అయితే పోలీసులు పట్టు విడవకుండా గాలించడంతో స్మగ్లర్ల ప్లాన్ బెడిసికొట్టింది. కారులో ఉన్న గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటిగా నీటిలో తేలడంతో పోలీసులు అక్కడికి వచ్చి మొత్తం 300ల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ నిందితుడిని పోలీసులు పట్టుకోగా, పరారైన మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.