రాబోయే ఎన్నికల్లో గట్టి లోక్‌సభ అభ్యర్థుల కోసం వెతుకుతున్నట్లు తెలిసింది.అందువల్ల.. మీరు ఇప్పటి నుంచే గట్టిగా తయారై.. బాబు గారి ముందు వెళ్లి నిలబడండి. ఎందుకంటే.. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన వాళ్లంతా.. ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. గెలిచిన ముగ్గురిలో.. ఇద్దరు మళ్లీ పోటీకి ఆసక్తి చూపడం లేదనే టాక్ వినిపిస్తోంది. అందువల్ల.. లోక్‌సభ రేసులోకి ఆర్థికంగా బలమైన అభ్యర్థులు దొరికితే.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం ఈజీ అని భావిస్తున్నారు బాబు గారు. అందుకే.. ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టేశారని.. పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో.. మెజారిటీ సీట్లు గెలిచేందుకు.. లోక్‌సభ స్థానాలపై ఫోకస్ పెట్టారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. వాటికి.. వీటికి లింక్ లేకపోయినా.. సింక్ అయ్యే విషయం ఒకటుంది. అదేమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలున్నాయ్. వీటిలో.. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. దాంతో.. ఇప్పటి నుంచే కేండిడేట్లను వెతికే పనిలో పడ్డారు చంద్రబాబు. లోక్‌సభకు పోటీ చేసేందుకు.. ఆర్థికంగా బలమైన అభ్యర్థి దొరికితే.. ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని అసెంబ్లీ సీట్లు గెలవడం ఈజీ అని.. టీడీపీ భావిస్తోంది.
శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ రాంమోహన్ నాయుడు.. మూడోసారి పోటీకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే.. విజయనగరం విషయానికొస్తే.. గతంలో మాదిరిగా అశోక్ గజపతిరాజే బరిలోకి దిగుతారా? కొత్తవారికి చాన్స్ ఇస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఇదే టైంలో.. రాజు గారు విజయనగరం అసెంబ్లీకి పోటీ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. విజయనగరం పార్లమెంట్ స్థానంలో.. గట్టి తూర్పు కాపు అభ్యర్థి కోసం చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అరకు ఎంపీ స్థానానికి.. గత ఎన్నికల్లో కిశోర్ చంద్రదేవ్ పోటీ చేశారు. కానీ.. ఇప్పుడాయన పార్టీకి చాలా దూరంగా ఉన్నారు. ఆయన స్థానంలో మాజీ ఐఏఎస్ అధికారి పేరు పరిశీలిస్తున్నారు.
ఇక.. విశాఖ లోక్‌సభ స్థానానికి.. బాలయ్య చిన్నల్లుడు భరతే బరిలోకి దిగుతారనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికల నాటికి పరిస్థితులు, పరిణామాలు, పొలిటికల్ ఈక్వేషన్స్ మారితే.. అభ్యర్థి కూడా మారే అవకాశం ఉంటుంది. అనకాపల్లి ఎంపీ సీటుకు.. గత ఎన్నికల్లో అడారి ఆనంద్ పోటీ చేశారు. ప్రస్తుతం.. ఆయన వైసీపీలో ఉన్నారు. దీంతో.. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి కుమారుడు.. చింతకాయల విజయ్ ఎంపీ బరిలో దిగే ఆలోచనలో ఉన్నారనే.. గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకినాడ విషయానికొస్తే.. గతంలో టీడీపీ నుంచి పోటీకి దిగిన చలమలశెట్టి సునీల్.. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. దీంతో.. ఇక్కడ కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే.. జనసేనతో గనక పొత్తు కుదిరితే.. అక్కడి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
గత ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేసిన మురళీమోహన్ కోడలు మాగంటి రూప.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీంతో.. ఈ సీటు కొత్త అభ్యర్థికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయ్. పార్టీలో సీనియర్ నేత.. లోకల్ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని.. ఎంపీగా పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే చర్చ.. పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఈ మధ్యే పార్టీలో చేరిన.. బొడ్డు వెంకటరమణ పేరు కూడా పరిశీలనలో ఉంది. అలాగే.. అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి బాలయోగి కుమారుడు హరీశ్ పోటీ చేశారు. ఈసారి కూడా అతనికే చాన్స్ ఇస్తారా? లేక.. హరీశ్‌ని అసెంబ్లీ బరిలో దించి.. కొత్త వ్యక్తిని.. ఎంపీగా పోటీ చేయిస్తారా? అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
నరసాపురం స్థానాన్ని.. పొత్తులో ఉండే పార్టీకి వదిలిపెట్టే చాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. అలాగే.. ఏలూరు నుంచి పోటీ చేసిన మాగంటి బాబు.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో.. బోళ్ల రాజీవ్, దొరబాబు పేర్లను.. తెలుగుదేశం నాయకత్వం పరిశీలిస్తోందని.. పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయి. ఇక.. వైసీపీ ప్రభంజనంలోనూ విజయవాడ నుంచి ఎంపీగా గెలిచారు కేశినేని నాని. కానీ.. ఆయన మనసు అసెంబ్లీపై ఉందని.. తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. నానికి ఇంట్రస్ట్ లేకపోతే.. గతంలో ఓసారి పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన.. పారిశ్రామికవేత్తను మళ్లీ రంగంలోకి దించే అవకాశం ఉంది. అలాగే.. మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి వంగవీటి రాధా పోటీ చేసే అవకాశం ఉంది. గుంటూరు నుంచి గల్లా జయదేవ్ పోటీకి దిగుతారా.. లేదా.. అన్నది సస్పెన్స్‌గా ఉంది. దీంతో.. మాజీ మంత్రి నారాయణ గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
ఇక.. నరసారావు పేట నుంచి రాయపాటి సాంబశివరావు, బాపట్ల నుంచి మల్యాద్రి.. మళ్లీ పోటీ చేసే చాన్స్ లేదు. దీంతో.. నరసరావుపేట నుంచి వడ్డెర సామాజికవర్గానికి చెందిన ఓ పారిశ్రామికవేత్తను బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒంగోలు నుంచి.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త రెడీగా ఉన్నట్లు సమాచారం. అలాగే.. నెల్లూరు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన బీదా మస్తాన్ రావు.. ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. దీంతో.. అధికార పార్టీలో ఉన్న ఓ ఎంపీ.. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని.. జోరుగా ప్రచారం సాగుతోంది. హిందూపురం నుంచి నిమ్మల కిష్టప్ప, అనంతపురం నుంచి జేసీ పవన్ రెడ్డి.. మళ్లీ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా లేరనే టాక్ వినిపిస్తోంది. దీంతో.. హిందూపురం పరిధిలో యాక్టివ్‌గా ఉన్న మహిళా నేత సబితకు.. ఎంపీ టికెట్ కేటాయిస్తే ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులును పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది.
ఇక.. కడప నుంచి సీనియర్ నేత శ్రీనివాసులు రెడ్డి పోటీ చేసే చాన్స్ ఉంది. కర్నూలు నుంచి.. మళ్లీ కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. నంద్యాలలో.. మళ్లీ మాండ్ర శివానంద రెడ్డికే అవకాశం ఇద్దామా? లేక.. భూమా కుటుంబంలో వారికి గానీ.. ఫారుఖ్‌కి గానీ చాన్స్ ఇద్దామా అనే చర్చ పార్టీలో సాగుతోంది. రాజంపేట నుంచి బెంగళూరులో పారిశ్రామికవేత్త అయిన బలిజ సామాజికవర్గ నేతను రంగంలోకి దించేందుకు.. చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు.
చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి దివంగత ఎంపీ శివప్రసాద్ కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తారా? వేరే వారికి.. చాన్స్ ఇస్తారా అన్నది చూడాలి. చివరగా.. తిరుపతి నుంచి మరోసారి పనబాక లక్ష్మిని బరిలోకి దించే సూచనలు కనిపిస్తున్నాయ్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. ఇప్పటి నుంచె గెలుపు గుర్రాల కోసం వేట మొదలుపెట్టడంపై.. పార్టీలో లోలోపల పెద్ద చర్చే జరుగుతోంది. ఆఖరి వరకు.. టీడీపీ లోక్‌సభ అభ్యర్థుల పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడాలనుకుంటున్నారు చంద్రబాబు.