వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లు పెట్టడం వలన వచ్చే నష్టమేమిటో చెప్పకుండా రైతులను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు తగదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హితవు పలికారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ విద్యుత్ పక్క దారి పట్టకుండా మీటర్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో అమలు చేసిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని, అక్కడ 30 శాతం విద్యుత్ ఆదా అయినట్టు గుర్తించామని తెలిపారు.
అన్ని జిల్లాల్లో దశలవారీగా మీటర్లు పెట్టబోతున్నట్లు చెప్పారు. సబ్సిడీ సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు. మీటర్ల వల్ల రైతులకు జరిగే నష్టమేమిటో చెప్పలేని దుస్థితిలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ నాయుడు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఉన్నారన్నారు. వ్యవసాయం దండగ, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలారేసుకోవాలంటూ విమర్శించిన చంద్రబాబుకు రైతుల కోసం మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు.