మీ ఫోన్ ఇవ్వండి మా వాళ్లకు ఫోన్ చేసి ఇస్తా అన్న మాటలను నమ్మితే మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అపరిచిత వ్యక్తులకు సాయం చేస్తే ప్రాణం మీదకు వస్తుందనడానికి నిదర్శనం ఈ ఘటన. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదోల్ జిల్లాలో ఒక ఘటన జరిగింది. 54 ఏళ్ల ప్రైవేటు పాఠశాల టీచర్ రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయారు.
షాదోల్ రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మనోజ్ నెమా అనే ప్రైవేటు స్కూల్ టీచర్ దుర్గ్-అజ్మీర్ రైలులో సాగర్ కు ప్రయాణం చేస్తున్నారు. రైలు షాదోల్ రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉన్నప్పుడు. ఒక గుర్తు తెలియని వ్యక్తి మనోజ్ వద్దకు వచ్చి అత్యవసరంగా కాల్ చేసుకోవాలంటూ ఫోన్ అడిగాడు. దీంతో మనోజ్ నెమా తన ఫోన్ ను ఇచ్చాడు. అపరిచితుడు ఫోన్ కాల్ చేస్తున్నట్టు నటించాడు.
ఇంతలోనే రైలు షాదోల్ స్టేషన్ లో ఆగడంతో రైలు దిగి పరుగెత్తబోయాడు. అతడ్ని వెంబడించి పట్టుకునేందుకు మనోజ్ కూడా పరుగు తీశాడు. అదుపుతప్పి పట్టాలపై పడిపోవడం.. ఆ వెంటనే రైలు అతడిపై నుంచి వెళ్లిపోవడంతో ప్రాణాలు విడిచినట్టు రైల్వే పోలీసులు వెల్లడించారు. పోలీసులు నిందితుడైన రాజేంద్రసింగ్ ను అరెస్ట్ చేశారు. షాదోల్ జిల్లా ఖేరి గ్రామవాసిగా గుర్తించారు. అపరిచితులను వెంటనే నమ్మకూడదు అన్నది ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది.