నోయిడాకు చెందిన ఓ ఆరేళ్ల బాలిక తాను చనిపోతూ ఐదుగురికి ప్రాణాలు పోసింది. ఢిల్లీ ఎయిమ్స్ చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలైన ప్రాణదాతగా నిలిచింది. రోలీ ప్రజాపతి(6) అనే ఈ బాలికపై నోయిడాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దుండగులు కాల్చిన తూటా ఆమె తలలోకి వెళ్లింది. ఆస్పత్రికి తరలించిన కాసేపటికే బాలిక కోమాలోకి వెళ్లిపోయింది. మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినా బాలికను కాపాడలేకపోయారు. బాలిక బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపారు.
అవయవ దానం గురించి డాక్టర్లు తమకు వివరించారని రోలీ తండ్రి హర్ నారాయణ్ ప్రజాపతి పేర్కొన్నారు. తమ కూతురు లేకపోయినా ఇతరుల్లో జీవించి ఉంటుందన్న ఉద్దేశంతో అవయవ దానం చేసినట్లు తెలిపారు. బాలిక లివర్, రెండు కిడ్నీలు, రెండు కార్నియాలు, గుండె కవాటాన్ని స్వీకరించినట్లు డాక్టర్లు తెలిపారు.