ఓ యువకుడు గ్రాడ్యుయేషన్ చేసి గాడిదలు కాస్తూ కోట్లలో ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. తమిళనాడు తిరునెల్వేలి జిల్లా తులుకపట్టి గ్రామంలో గాడిదల ఫామ్‌ను బాబు అనే యువకుడు నెలకొల్పి బిజినెస్ చేస్తున్నాడు. తమిళనాడు రాష్ట్రంలో తొలి గాడిదల ఫామ్ ను ఇతనే నెలకొల్పడం విశేషం. ఈనెల 14వ తేదిన జరిగిన ప్రారంభోత్సవానికి తిరునెల్వేలి జిల్లా కలెక్టర్ విష్ణు ముఖ్యఅతిథిగా హాజరై అతడిని ప్రశంసించాడు.
'ద డాంకీ ప్యాలెస్' ఫామ్ ను బాబు స్థాపించి వంద గాడిదలతో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. గాడిదల కోసం అనేక సదుపాయాలను అతను కల్పించాడు. గాడిద పాలు తీసి, ప్రాసెస్ చేసి, నిల్వ చేసేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి పెట్టుకున్నాడు. ఔషధ గుణాలు, పోషకాలు ఉండే గాడిద పాలను సౌందర్య ఉత్పత్తుల తయారీలో విక్రయిస్తారు కాబట్టి అతను తన ఫామ్ లోని పాలను బెంగళూరులోని సబ్బులు, ఇతర కాస్మోటిక్స్ తయారు చేసే సంస్థలకు విక్రయిస్తున్నాడు. బహిరంగ మార్కెట్లో లీటరు గాడిద పాల ధర రూ.7వేల వరకు ఉండటంతో అతని వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఏటా అతని ఆదాయం కోట్లలో సాగుతోంది. బాబు చేస్తున్న పనికి అతడిని అందరూ ప్రశంసిస్తున్నారు.