పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు జైలు శిక్ష పడింది. 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో ఆయనకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.1988లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన కేసులో సిద్ధూను రూ.1000 జరిమానాతో విడిచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ బాధిత కుటుంబం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. 1988 డిసెంబరు 27న పాటియాలో పార్కింగ్ విషయంపై 65ఏళ్ల గుర్నామ్ సింగ్‌కు సిద్ధూ, తన స్నేహితుడు రూపిందర్ సింగ్‌లకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గుర్నామ్ సింగ్‌ను కారు నుంచి బయటకు లాగి సిద్దూ- రూపిందర్ సింగ్ సంధు అతడి తలపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన గుర్నామ్ సింగ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
అయితే, ఈ కేసులో 1999లో పటియాలాలోని సెషన్స్ కోర్టు సాక్ష్యాధారాలు సరిగా లేవని పేర్కొంటూ సిద్ధూ, అతడి స్నేహితుడిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బాధిత కుటుంబం పంజాబ్-హరియాణా హైకోర్టును ఆశ్రయించగా.. 2006లో సిద్ధూను హైకోర్టు దోషిగా తేల్చింది. నేరపూరిత హత్యగా పేర్కొంటూ మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో 2018లో సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. గుర్నామ్ సింగ్‌ను హత్య చేశారనేందుకు ఆధారాల్లేవంటూ హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. కానీ, సీనియర్ సిటిజన్‌ను గాయపరిచినందుకు సిద్ధూను దోషిగా తేల్చుతూ జైలు శిక్ష లేకుండా.. రూ.1000 జరిమానా విధించింది.
అయితే, ఈ తీర్పును వ్యతిరేకిస్తూ 2018 సెప్టెంబర్‌లో గుర్నామ్ సింగ్ కుటుంబం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయగా.. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ ఎస్‌కే కౌల్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సిద్ధూకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది. ఈ కేసులో లోపం ఉందని భావించినట్టు పేర్కొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. అందుకే జైలు శిక్షపై రివ్యూ పిటిషన్ విచారణకు అనుమతించినట్టు తెలిపింది. జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష కూడా సముచితమని భావించినట్టు తీర్పు వెలువరించే సమయంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది.