తపాలా శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగులకు టోకరా వేసి 57 లక్షలు దోచుకున్న కేసులో ఐదుగురు మోసగాళ్లను అరెస్టు చేసినట్లు టూ టౌన్ సిఐ చిన్న గోవిందు తెలిపారు.
నిందితులను అరెస్టు చేసిన వివరాలను గురువారం సాయంత్రం సిఐ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్ కు చెందిన బోయ సతీష్, తన సమీప బంధువులతో కలసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తా మని మోసానికి తెరతీశారన్నారు. పోస్టల్ శాఖలో తాను పనిచేస్తున్నానని తెలిపి విజయభాస్కర్, గంగాధర్ రెడ్డి లతో పరిచయం పెంచుకున్నాడు. వారి సహకా రంతో రైల్వే శాఖలో పనిచేస్తున్న షేక్ మహబూబ్ బాషా ను కలసి తాను పోస్టల్ శాఖలో పనిచేస్తున్నానని చెప్పి తన పేరిట ఉన్న నకిలీ శాలరీ స్లిప్, ఐడిని చూపించి నమ్మించాడని తెలిపారు.
మహబూబ్ బాషా ను ఇద్దరు పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి 2019 లో అతడి వద్దనుండి 57 లక్షలు తీసుకున్నాడని తెలిపారు. తన పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడంతో తాను మోస పోయానని గుర్తించి రెండు నెలల పోలీసు లకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ కేసులో విచారణ చేసి మోసంలో భాగమున్న బోయ సతీష్ తోపాటు అతని సోదరుడు బోయ సురేష్, తల్లి లక్ష్మి, సమీప బంధువు రాకెట్ల మస్తాన్, చిన్నాన్న బద్రీ లను అరెస్టు చేసినట్లు టూ టౌన్ సిఐ గోవిందు తెలిపారు.