ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. రూ.200 ఇవ్వలేదని ఓ లారీ డ్రైవర్ మహిళను ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో లారీ కింద పడి ఆ మహిళ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
చిలకలూరిపేటకు చెందిన రమణ(40) అనే మహిళ చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తోంది. తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని చిలకలూరిపేట నుంచి గుంటూరుకు వెళ్లేందుకు ఆమె ఓ లారీ ఎక్కింది. గుంటూరులోని నాయుడుపేట జిందాల్ కంపెనీ సమీపంలోకి చేరుకోగానే పిల్లలతో సహా రమణ లారీ దిగింది. తన వద్ద ఉన్న రూ.100 ను డ్రైవర్ కు ఇచ్చింది. కానీ అతను మరో రూ.200 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బుల్లేవని రమణ ఎంత చెప్పినా డ్రైవర్ వినలేదు.
ఆమె కూతురి చేతిలో ఉన్న సెల్ ఫోన్ ని లాక్కున్నాడు. సెల్‌ఫోన్ ని తీసుకోవాలనే ఉద్దేశంతో రమణ కూతురు లారీ ఎక్కగానే డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. అది చూసి రమణ కంగారు పడింది. లారీని పట్టుకుని పరిగెత్తింది. ప్రమాదవశాత్తు అదుపుతప్పి లారీ కింద పడి మృతి చెందింది. దీంతో లారీ డ్రైవర్ పాపను దించి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.