నిద్ర... మహిళల్లో ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తోంది. అయితే ఎక్కువగా ఆడవాళ్లు నిద్ర లేమితో సమస్యతో సతమతమవుతుంటారు. శరీరంలో హార్మోన్లలో మార్పుల వల్ల మహిళల్లో నిద్ర లేమి సమస్య తలెత్తుంది.
మహిళల శరీరాల్లో పీరియడ్స్, గర్భం, మెనోపాజ్ సమయాల్లో హార్మోన్లలో మార్పు వస్తుంది. సాధారణంగా మహిళలు రాత్రి పూట ఏడు గంటల పాటు నిద్రపోవాలి. గర్భిణీలైతే తప్పనిసరిగా తొమ్మిది గంటలపాటు నిద్ర పోవాలి. సరైన నిద్ర లేకపోవడంతో మహిళల్లో ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. తక్కువ సమయం నిద్రపోయే వారికి ఎముకలో ఖనిజ సాంద్రత (బీఎండీ) తగ్గుతుంది. దీనివల్ల ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంది. మహిళలో చురుకుతనాన్ని కోల్పోయి బలహీనంగా మారుతారు.
అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల నిద్ర లేమి సమస్యకు దూరంగా ఉండొచ్చు. నిద్ర వచ్చినప్పుడు వెంటనే నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఆపై ప్రతి ఉదయం అదే సమయంలో లేచేలా అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. శారీరక శ్రమ వల్ల నిద్ర కచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. పడుకునే గది నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, చల్లగా ఉండేలా చూసుకోవాలి. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, స్నానం చేయడం వంటివి నిద్ర రావడానికి సహాయపడతాయి. అలాగే టీవీ చూడడం, ఫోన్ చూడడం వంటి బంద్ చేయాలి. రోజూ కనీసం ఏడు గంటలు నిద్రపోవడం అనేది.. దినచర్యగా అలవాటు చేసకుంటే.. మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.