సాధారణంగా ఎవరి నుంచైనా ఏదైనా ఆపద తలెత్తితే అందరికీ గుర్తొచ్చేది పోలీసులే. అయితే కొందరి పోలీసుల వ్యవహార శైలి మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొస్తోంది. ఇదే కోవలో కొందరు పోలీసులు ఓ మహిళను స్టేషన్‌లో నిర్బంధించి చిత్ర హింసలు పెట్టారు. బూటు కాళ్లతో తన్నుతూ, కరెంట్ షాక్ పెట్టారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఉత్తరాఖండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోగివాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో మంజు అనే మహిళ నివసిస్తోంది. పక్కనే ఉన్న మోహకంపూర్ గ్రామంలోని ఓ రిటైర్డ్ ఉద్యోగి దేవెంద్ర ధ్యాని ఇంట్లో పని చేస్తోంది. మే 14న దేవెంద్ర కుటుంబం పెళ్లికి వెళ్లారు. తిరిగిరాగా ఇంట్లో డబ్బు, బంగారం మాయమవడం గమనించారు. పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేస్తూ, జోగివాలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణలో పనిమనిషి మంజును పోలీసులు చిత్ర హింసలకు గురి చేశారు. లాఠీలతో కొట్టి, బూటు కాళ్లతో తన్నారు. ఆ తర్వాత కరెంట్ షాక్ కూడా పెట్టి దారుణంగా ప్రవర్తించారు. వారి దెబ్బలకు ఆమె స్పృహ తప్పింది. ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద పడేశారు. ఆమెను భర్త ప్రభుత్వాసుపత్రిలో చేర్పించాడు. విషయం వెలుగులోకి రాగానే పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. బాధ్యులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.