పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇంధన సంస్థలు వరుసగా షాక్‌లు ఇస్తూనే ఉన్నాయి. తాజాగా సీఎన్‌జీ ధర రెండు వారాల వ్యవధిలో రెండోసారి పెరిగింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ శనివారం ఢిల్లీలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరను కిలోకు రూ.2 పెంచింది. దీంతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.75.61కు చేరింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో సీఎన్‌జీ ధర కిలో రూ.78.17కి, గురుగ్రామ్‌లో రూ.83.94కి చేరింది.
అంతకుముందు, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ మే 15న ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో సీఎన్‌జీ ధరను కిలోకు రూ.2 చొప్పున పెంచింది. గత ఏడాది అక్టోబరు నుంచి దేశీయంగా, అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరగడం ప్రారంభించినప్పటి నుంచి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ఎప్పటికప్పుడు ధరలను పెంచుతూనే ఉన్నారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధర కిలోకు రూ.2 పెరగడంతో, ధరల పెంపు తమ జీవితాలను ప్రభావితం చేస్తోందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు.