శ్రీలంకలో దారుణ పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. ఇప్పటికే ఆ దేశంలో ఇంధన నిల్వలు అడుగంటాయి. ఈ తరుణంలో ప్రజా రవాణా సౌకర్యాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో శుక్రవారం పాఠశాలలను మూసివేశారు. అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభం మధ్య పరిస్థితులు చక్కబడే వరకు పనికి రావద్దని ప్రభుత్వ అధికారులను సర్కారు కోరింది. ప్రస్తుతం ఇంధన కొరత, దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాల సమస్యల దృష్ట్యా అత్యవసర సేవలను నిర్వహించే వారు తప్ప శుక్రవారం విధులకు రావద్దని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిత్వ శాఖ ప్రభుత్వ అధికారులను కోరింది.
ఇంధన కొరత తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు కూడా శుక్రవారం మూసివేయబడ్డాయి. లీటర్ పెట్రోల్ కోసం దేశవ్యాప్తంగా ఇంధన స్టేషన్ల వద్ద వేలాది మంది ప్రజలు రోజుల తరబడి క్యూలలో వేచి ఉన్నారు. ఇటీవలి కాలంలో ఇంధనం, గ్యాస్, ఇతర నిత్యావసరాల దిగుమతి కోసం చెల్లించడానికి విదేశీ మారక ద్రవ్యం దొరక్క ప్రభుత్వం కష్టపడుతోంది. ఈ ఆర్థిక కష్టాలు రాజకీయ సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయి. దీంతో పెరుగుతున్న ఇంధన ధరలు, నిత్యావసరాల వస్తువుల ధరలతో శ్రీలంక ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఏకంగా దేశ ప్రధాని, అధ్యక్షుడి నివాసాలను సైతం ముట్టడించారు. ఈ క్రమంలో అక్కడ ఇటీవల నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఆ దేశంలో ప్రస్తుతం 25 మిలియన్ డాలర్ల విదేశీ నిల్వలు మాత్రమే ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.