ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయి: సుప్రీం కోర్టు

national |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 03:05 PM

మే 17న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని, మసీదులో ముస్లింల నమాజ్‌కు ఎటువంటి ఆటంకం కలిగించవద్దని సుప్రీంకోర్టు సూచించింది. ఈ వివాదంపై వేసవి సెలవుల అనంతరం విచారణ చేపడతామని, అంత వరకూ అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా సెలవులను గడపాలని ఆశిస్తున్నామని చెప్పింది. ఇదిలావుంటే అంతకు ముందు మసీదు కమిటీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో బయటపడిన ఆకారం శివలింగం కాదని, ఇది చెరువులోని ఫౌంటెన్‌కు సంబంధించిన రాతి శిల అని తెలిపారు. చాలా ఏళ్లుగా ఇది మూతపడి ఉందని పేర్కొన్నారు.


జ్ఞానవాపి మసీదు సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం మధ్యాహ్నం విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా సర్వే నివేదికపై కీలక సూచనలు చేసింది. మీడియాకు లీకులు ఇవ్వడాన్ని నిలిపివేయాలని సూచించింది. నివేదికను కేవలం న్యాయమూర్తి మాత్రమే బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది. ఇవి సంక్లిష్టమైన సామాజిక సమస్యలని, ఏ మానవ పరిష్కారమూ పరిపూర్ణంగా ఉండదని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. మా ఆదేశం కొంతవరకు శాంతి, ప్రశాంతతను కొనసాగించడమేనని తెలిపింది. మా మధ్యంతర ఉత్తర్వులు కొంత ఊరట కలిగిస్తాయమని పేర్కొంది.


మేము దేశంలో ఐక్యమత్యాన్ని కాపాడే లక్ష్యంతో ఉన్నామని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా వివాదాన్ని వారణాసి జిల్లా కోర్టుకు కేసు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై సీనియర్, అనుభవజ్ఞులైన జడ్జ్ విచారణ చేపట్టాలని ఆదేశించింది. సివిల్ వివాదంలోని అత్యంత సున్నితమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, కేసును సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి నుంచి జిల్లా జడ్జికి బదిలీ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. సీసీపీ నిబంధన 11లోని 7 ప్రకారం పిటిషన్ దాఖలు చేశారని, ప్రాధాన్యతను జిల్లా జడ్జ్ నిర్ణయిస్తారని తెలిపింది.


మసీదు నిర్వహణ కమిటీ చేసిన విజ్ఞప్తిపై ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం 1991 కింద నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించింది. 1991 ప్రార్థనా స్థలాల చట్టంలోని సెక్షన్ 3 ఓ ప్రదేశం మతపరమైన స్వభావాన్ని నిర్ధారించడం నిషేధించదని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘ఒకవైపు మసీదు, మరోవైపు గుడి ఉందనే విషయాన్ని మర్చిపోండి.. పార్సీ దేవాలయం ఉందనుకోండి.. ఆ ప్రాంతంలో ఒక శిలువ ఉంటే దాని ఉనికి చర్చిగా మారుతుందా? ఈ అంశం తెలియనిది కాదు.. ఇక్కడ నిర్మాణం జొరాస్ట్రియన్ లేదా క్రైస్తవ విశ్వాసం కాదు.. కానీ ఒక స్థలం మతపరమైన స్వభావాన్ని నిర్ధారించడానికి తప్పనిసరిగా 1991 చట్టంలోని సెక్షన్ 3కి అనుగుణంగా ఉండకపోవచ్చు’’ అని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa