ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివక్షపై న్యాయ పోరాటం చేసింది...విజయమే కాదు నష్టపరిహారం సాధించింది

international |  Suryaa Desk  | Published : Sun, May 22, 2022, 07:13 PM

మనం ఎప్పుడైనా ఎక్కడైనా వివక్షకు గురైతే దానిని మనలోమనమే దిగమింగుకుంటా. కానీ సహనానికీ ఓ హద్దు ఉంటుందన్నది ఓ సహనశీల విసిగిచేసిన న్యాయం పోరాటంతో స్పష్టమైంది. అంతేకాదు తనకు జరిగిన ఈ వివక్షపై ఆమె సాధించిన న్యాయపోరులో ఆమె విజయం సాధించింది. అంతేకాదు నష్టపరిహారం కింద ఏకంగా పెద్ద మొత్తం సొత్తును కూడా కైవసం చేసుకొంది.


సహచర ఉద్యోగులు తనను పిలవకుండా ఔటింగ్‌కు వెళ్లినందుకు ఓ మహిళ ఏకంగా 72 లక్షల రూపాయలు (74,000 పౌండ్లు) గెలుచుకుంది. లండన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లండన్‌కు చెందిన రీటా లెహర్ (51 ఏళ్లు) తూర్పు లండన్‌లోని స్ట్రాట్‌ఫోర్డ్‌ ప్రాంతంలోని ఆస్పెర్స్ కాసినోలో క్యాషియర్‌గా పనిచేసేవారు. అక్కడ పనిచేసే ఉద్యోగులంతా కలిసి ఒక రోజు డ్రింక్ పార్టీకి వెళ్లారు. ఆ పార్టీకి రీటాను ఆహ్వానించలేదు. ఆమె ఒక్కరినే పిలవలేదు. మిగిలిన వారంతా పార్టీకి వెళ్లి ఎంజాయ్ చేసొచ్చారు. అంతే కాకుండా.. కార్యాలయానికి తిరిగొచ్చిన తర్వాత కొంత మంది ఉద్యోగులు తమ ఔటింగ్ గురించి రీటా ముందు చర్చించారు. ఆమె నొచ్చుకునేవిధంగా వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ ఆఫ్రికన్ సంతతికి చెందిన రీటాపై జాతి, వయస్సుకు సంబంధించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఊహించని ఈ పరిణామానికి రీటా లెహర్ ఎంతో బాధపడ్డారు.


2011లో కాసినోలో పనిచేయడం ప్రారంభించిన రీటా లెహర్.. తోటి ఉద్యోగులను ఏనాడూ వివక్షతో చూడలేదు. తన కెరీర్‌లో ఎంతో మందిని వారి నైపుణ్యం గుర్తించి ప్రోత్సహించారు. ఆమె నుంచి లబ్ధి పొందిన వారిలో ఎక్కువ మంది తెల్ల జాతీయులే ఉన్నారు. ఇంత చేసినా ఆమెకు మాత్రం వృత్తిలో ఎదుగుదల లేదు. తన ప్రమోషన్ రిక్వెస్ట్ లెటర్లను ఎన్నోసార్లు తిరస్కరించారు. కాసినోలోకి రావడానికి ముందు రీటాకు గేమింగ్ రంగంలో 22 ఏళ్ల అనుభవం ఉంది. లండన్‌ నగరంలో ప్రఖ్యాత కాసినోల్లో డీలర్‌గా, షాప్ మేనేజర్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. కానీ, ఇవన్నీ పట్టించుకోకుండా ఆమెను పక్కనబెట్టారు.


ఈ పరిణామాలన్నింటితో తీవ్ర ఒత్తిడికి గురైన రీటా.. 2018లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వ్యక్తిగత ఇబ్బందులతో 2021లో తిరిగి జాబ్‌లో చేరారు. ఆ క్షణం నుంచి ఉద్యోగులు ఆమెను దూరం పెట్టడం మరింత ఎక్కువైంది. ఇక చూస్తూ ఊరుకోలేక దీనిపై ఆమె ఫిర్యాదు చేశారు.


‘పార్టీకి ఆమెను మాత్రమే ఆహ్వానించలేదు. ఆమెను ఆహ్వానించనప్పుడు ఆమె ముందు ఏర్పాట్ల గురించి, పార్టీలో అనుభవాల గురించి చర్చించడం అసభ్యకరమని మేమంతా అంగీకరిస్తున్నాము. సాధారణంగా కార్యాలయంలో ఒక ప్రత్యేక సందర్భం నుంచి ఒకానొక ఉద్యోగిని మినహాయించినప్పుడు, ఆ పరిణామం సదరు ఉద్యోగినికి పనిలో హాని కలిగించవచ్చునని మేము ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నాము’ అని విచారణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. రీటా లెహర్ మనోభావాలను గాయపర్చినందుకు, ఆమె ఆస్పర్స్ కాసినోను విడిచిపెట్టేందుకు కారణమైనందుకు నష్ట పరిహారంగా మొత్తం £74,113.65 అందజేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి సారా మూర్ తీర్పునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com