ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మంగళవారం ఊహించని ట్విస్ట్ తెరపైకి వచ్చింది. వ్యక్తిగత వ్యవహారాలలో సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకోవడం వల్లే ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేశారని సోమవారం మీడియాకు కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు చెప్పారు. కాకినాడలోని ఎమ్మెల్సీ అపార్ట్‌మెంట్ వద్ద గొడవ జరిగిందని, తోపులాటలో సుబ్రహ్మణ్యం పడిపోవడంతో చనిపోయాడని ఎస్పీ పేర్కొన్నారు. అయితే అసలు అపార్ట్‌మెంట్ వద్ద ఎటువంటి గొడవ జరగలేదని అక్కడి వాచ్‌మెన్ శ్రీను వెల్లడించాడు. మృతుడు సుబ్రహ్మణ్యానికి అతడు స్వయాన చిన్నాన్న అవుతాడు. ఆ రోజు గొడవలేవీ జరగలేదని, రాత్రి 11 గంటల వరకు తాము మేల్కునే ఉన్నామని శ్రీను చెప్పాడు.
ఇక హత్య జరిగిన రోజు మే 19న రాత్రి అపార్ట్‌మెంట్ వద్ద సీసీ టీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. అందులో ఎస్పీ చెబుతున్నట్లు గొడవ జరిగినట్లు ఎక్కడా కనిపించ లేదు. అంతేకాకుండా సాయంత్రం భార్యతో కలిసి ఎమ్మెల్సీ అనంత బాబు బయటకు వెళ్లి, రాత్రి 12 గంటలకు తిరిగి వచ్చినట్లు సీసీ టీవీలలో రికార్డు అయింది. ఈ విషయాన్నే అక్కడి వాచ్‌మెన్ శ్రీను తాజాగా మీడియాకు వెల్లడించారు. మరోవైపు బయటకు వచ్చిన సీసీ టీవీ ఫుటేజీలో ఎమ్మెల్సీ అనంత బాబు హడావుడిగా ప్రవర్తించడం కనిపించింది.