కేరళకు చెందిన విస్మయ ఆత్మహత్య కేసులో ఆమె భర్తను అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళకు చెందిన ఆయుర్వేద డాక్టర్ విస్మయ ఆత్మహత్యకేసులో విచారణ సందర్బంగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ‘‘వరకట్న భూతానికి వ్యతిరేకంగారు ఈ తీర్పు.. ఏ ఒక్క వ్యక్తికీ వ్యతిరేకం కాదు’’ అని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యాఖ్యానించారు. వరకట్న వేధింపులకు పాల్పడినట్టు నేరం రుజువైతే కనీసం ఏడేళ్లు.. గరిష్ఠంగా యావజ్జీవిత ఖైదు విధిస్తారు. ఐపీసీ సెక్షన్ 498 (ఏ) కింద వరకట్న వేధింపులు, ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి నేరాలకు వరుసగా మూడేళ్లు, 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు.
ఇదిలావుంటే మార్చి 2020లో ఆర్టీఏ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కిరణ్‌కు విస్మయను ఇచ్చి వివాహం జరిపించారు. కట్నం కింద 100 సవర్ల బంగారం, రూ.10 లక్షలపైగా నగదు, ఎకరానికి పైగా భూమి, కారును కట్నంగా ముట్టజెప్పారు. అయితే కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన విస్మయకు కొద్దిరోజులకే వేధింపులు మొదలయ్యాయి. తనకు కట్నంగా ఇచ్చిన కారుకు బదులుగా నగదు కావాలని భర్త పట్టుబట్టాడు. దీనికి తోడు అదనపు కట్నం తీసుకురావాలంటూ విస్మయను చిత్రహింసలు పెట్టేవాడు. అదనపు కట్నం కోసం భర్త, అతని కుటుంబం చిత్రహింసలకు గురిచేసి చివరికి విస్మయ చావుకు కారణమయ్యారు. కడక్కల్‌లోని కైతోడ్‌కు చెందిన విస్మయ (23) గతేడాది జూన్ 21న బాత్‌రూమ్‌లో ఉరేసుకుని కనిపించింది.
దేశవ్యాప్తంగా కన్నీళ్లు పెట్టించిన వరకట్న వేధింపులకు బలైన కేరళ ఆయుర్వేద డాక్టర్ విస్మయ ఘటనలో భర్తను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. విస్మయ భర్తను దోషిగా నిర్ధారించిన అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ కేఎన్ సుజాత శిక్షను ఖరారు చేయనున్నారు. వరకట్న నిరోధక చట్టం సహా ఐపీసీలో పలు సెక్షన్ల కింద విస్మయ భర్తను దోషిగా నిర్ధారించినట్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జీ మోహన్‌రాజ్ తెలిపారు. కోర్టు బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాసిక్యూషన్, దోషి వాదనలు విన్న తర్వాత మంగళవారం శిక్షను ఖరారు చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దోషి కిరణ్ కుమార్‌కు వీలైనంత మేర కఠిన శిక్షను విధించనున్నారని చెప్పారు.
తీర్పుపై విస్మయ తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తెకు న్యాయం జరిగిందన్నారు. ఈ కేసు విషయంలో ప్రాసిక్యూషన్, దర్యాప్తు బృందం చేసిన ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి నాకు మాటలు చాలడం లేదని భావోద్వేగానికి గురయ్యాడు. కేసు విచారణకు చాలా మంచి దర్యాప్తు బృందం, ప్రాసిక్యూటర్‌ను ప్రభుత్వం నియమించిందని అన్నారు. ఈ తీర్పు వెలువడటానికి కొద్ది సమయానికి ముందు కేరళ రాష్ట్ర రవాణా మంత్రి ఆంటోనీ రాజు మాట్లాడుతూ.. క్రిమినల్ కేసులో కోర్టు నిర్ణయంతో సంబంధం లేకుండా కుమార్‌ను సర్వీస్ నుండి తొలగించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న విస్మయ భర్త ఈ కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకొచ్చారు.
దోషిగా నిర్దారణ కావడం వల్ల బెయిల్ రద్దయింది. దీంతో అతడ్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా జైలుకు తరలించిన పోలీసులు.. మంగళవారం కోర్టుకు హాజరుపరచనున్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న కుమార్‌ను తీర్పుపై విలేకరులు పదేపదే అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa