కేరళలో ఇటీవల వెలుగు చూసిన టొమాటో ఫీవర్ క్రమేపీ మిగిలిన రాష్ట్రాలను కూడా వణికిస్తోంది. తమ రాష్ట్రంలో 26 మంది చిన్నారులకు టొమాటో ఫీవర్ సోకిందని ఒడిశా హెల్త్ డైరెక్టర్ బిజయ్ మహపాత్ర మంగళవారం తెలిపారు. భువనేశ్వర్‌లోని ఆర్ఎంఆర్‌సీలో సేకరించిన నమూనాలలో 26 కేసులు టొమాటో ఫ్లూగా తేలిందన్నారు. ఇందులో 19 మంది చిన్నారులు భువనేశ్వర్‌కు చెందిన వారు కాగా, రెండు ఖోర్ధా నుండి, మూడు పూరీ నుంచి, రెండు కటక్‌కి చెందిన చిన్నారులకు సోకినట్లు పేర్కొన్నారు. టొమాటో ఫ్లూ సోకిన పిల్లలందరూ ఒకటి నుంచి 9 ఏళ్లలోపు వారని ఆయన వెల్లడించారు.
కేసులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు మహాపాత్ర తెలిపారు. రోగుల పరిస్థితి తీవ్రంగా లేనప్పటికీ, వారు సాధారణంగా లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. నోటి లోపల ఎర్రటి గాయాలు, చర్మంపై దద్దుర్లు, ఆకలి లేకపోవడం, దగ్గు, ఆహారాన్ని మింగేటప్పుడు గొంతులో నొప్పితో బాధపడుతున్నారని చెప్పారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యాధి చాలా అరుదుగా ప్రాణాంతకమవుతుందని తెలుస్తోంది. అయితే జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, ఇతర వ్యాధుల మాదిరిగానే ఆహారం తీసుకోవడం తగ్గడంతో గొంతు నొప్పిని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఐసోలేషన్‌లో ఉంచి, మెరుగైన ఆహారాన్ని, వైద్యులు సూచించిన మందులను అందిస్తే చిన్నారులు వేగంగా కోలుకుంటారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.