డీకార్బనైజ్డ్ విద్యుదుత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఉజ్వల భవిష్యత్తు కోసం కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తూ ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో 5,230 మెగావాట్లతో భారీ ఇంటిగ్రేడెట్ పంప్డ్ స్టోరేజ్ పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టు పనులను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో దాదాపు 33 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తికి అవకాశాలున్నాయని, వీటిని వినియోగించుకోవాలని కోరారు. ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) సందర్భంగా దావోస్‌లో మూడో రోజు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాన్సిషన్ టు డీకార్బనైజ్డ్ ఎకానమీ సదస్సులో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు.