రాష్ట్రానికి ఏకైక విలన్ చంద్రబాబేనని మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. అమలాపురం అల్లర్ల వెనుక చంద్రబాబు, పవన్ ఉన్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాకు కోనసీమ - అంబేడ్కర్ పేరు పెట్టాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి, మరికొన్ని పార్టీలు వినతిపత్రాలు ఇచ్చాయి. మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలు మొత్తంగా ఏకకంఠంతో కోనసీమ-అంబేడ్కర్ జిల్లాకు మద్దతు పలికారు. ప్రభుత్వం ఆ విధంగా ముందుకువెళ్ళి నిర్ణయం తీసుకున్నాక, టీడీపీ, జనసేన పార్టీలు అగ్గి రాజేశాయి. టీడీపీ, జనసేన లు సమన్వయంతో కుట్రలు చేస్తూ, ప్రజల ముందు ఒకరకంగా, ప్రజలు వెనుక మరోరకంగా మాట్లాడుతూ, ప్రశాంతంగా ఉన్న కోనసీమలో చిచ్చు పెట్టారు. ఇటువంటి కుట్ర రాజకీయాలను రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠంతో ఖండించాలి. అటువంటి పార్టీలను శిక్షించాలన్నారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడారు.