కోనసీమ భగ్గుమంది. జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయాయి. పక్కా స్కెచ్‌తో జిల్లాలోని దళిత, బీసీ నేతలను టార్గెట్ చేసుకుంటూ పెట్రేగిపోయాయి. ఇది కొన్ని కులాలు, వర్గాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావటంతో పోలీసులు పూర్తిస్థాయిలో సంయమనం పాటించగా... దాన్ని అలుసుగా తీసుకున్న ఆ వర్గాలు విచ్చలవిడిగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తుల్ని ధ్వంసం చేశాయి.
జిల్లాకు చెందిన దళిత మంత్రి పినిపె విశ్వరూప్, బీసీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను తగలబెట్టాయి. పక్కా పథకం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం వరకూ చడీచప్పుడూ లేకుండా... ఒక్కసారిగా వేల మంది యువకులు రోడ్లమీదకు వచ్చి హింసకు తెగబడ్డారు. జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడానికి నిరసనగా శాంతియుతంగా ర్యాలీ చేస్తామని రెండుమూడు రోజులుగా కోనసీమ జిల్లా పరిరక్షణ సమితి చెబుతూ వస్తోంది.
ఈ మేరకు సోషల్ మీడియాలో మెసేజులు పంపింది. కానీ సోషల్ మీడియాలో మెసేజీలు అందుకున్న వేల మంది యువకులు మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి రాళ్లు రువ్వుతూ... పెట్రోలు డబ్బాలతో ఆస్తుల్ని తగలబెడుతూ రెచ్చిపోవటంతో ఇదంతా ముందస్తు కుట్ర మేరకే జరిగిందన్న అనుమానాలకు బలం చేకూరింది. అల్లరి మూకలు రాళ్ల దాడులకు దిగటంతో సాక్షాత్తూ జిల్లా ఎస్పీ, డీఎస్పీతో పాటు ఏకంగా 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి.