వచ్చే మాసంలో మరో ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఐఎస్ఆర్ ఓ) సన్నద్దమవుతోంది. దేశీయ డీటీహెచ్ అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జీశాట్-24 ఉపగ్రహాన్ని జూన్ 22న కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఐఎస్ఆర్ ఓ) కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది తొలినాళ్లలో శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్‌ఎల్‌వీ-మార్క్3 ద్వారా జీశాట్-3ని నింగిలోకి పంపాలని ఇస్రో భావించింది. కానీ, ఇది సాధ్యపడకపోవడంతో తాజాగా, ఫ్రెంచ్ గయానాలోకి కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించాలని నిర్ణయించింది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఏరియన్-5 రాకెట్ ద్వారా దీనిని పంపనున్నారు. కాగా, ప్రయోగానికి అవసరమైన నిధులను ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం ఎన్‌ఎస్‌ఐఎల్ సమకూర్చింది.
ఏరియన్ స్పేస్ ద్వారా కక్ష్యలోకి పంపుతున్న 25వ భారతీయ ఉపగ్రహం ఇది. ప్రయోగం గురించి ఏరియన్‌స్పేస్ సంస్థ ట్విట్టర్‌లో వెల్లడించింది. ‘‘హలో విన్నారా! మా వీఏ 257 రెండో ప్రయాణీకుడు జీఎస్ఏటీ-24కి స్వాగతం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్మించిన ఈ ఉపగ్రహం జూన్ 22న మా ఏరియన్5 అలాంచర్ ద్వారా ప్రయోగించనున్నాం... వివరాలు మేం మీకు తెలియజేస్తాం’’ అని తెలిపింది.
భారత ఉపగ్రహాన్ని భారత వైమానిక దళానికి చెందిన విమానం నుంచి దింపుతున్న కంటెయినర్‌ను కూడా అంతరిక్ష సంస్థ షేర్ చేసింది. డీటీహెచ్ అప్లికేషన్ అవసరాలను తీర్చడం కోసం జీశాట్-24ను టాటా స్కైకి లీజుకు ఇవ్వనున్నారు. ఇస్రో నిర్మించిన నాలుగు టన్నుల క్లాస్ కమ్యూనికేషన్ ‘కు-బ్యాండ్’ శాటిలైట్ జీఎస్ఏటీ-24 వాణిజ్య ప్రాతిపదికన న్యూస్పేజ్ ఇండియా లిమిటెడ్ యాజమాన్యంలో ఉంటుంది.
గతేడాది సెప్టెంబరు 28న జీఎస్ఏటీ-24 టెలికమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఏరియన్‌స్పేస్‌కు అప్పగించినట్టు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. అయితే, ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి జీఎస్ఎల్వీ- మార్క్3 ఎందుకు ఉపయోగించడం లేదు అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది.