పోలవరాన్ని కట్టే ఉద్దేశం కేంద్రానికి లేదని.. అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలకు కూడా లేదని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి ఆరుణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఎలా ఉందో.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా అలాగే ఉందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదని వ్యాఖ్యానించారు. పోలవరం డ్యామ్ నిర్మాణం చేయాలంటే.. పెద్ద ఎత్తున పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని తాను మానసికంగా సిద్ధపడ్డానని వ్యాఖ్యానించారు.
పోలవరం ఎలాగో కాదని, ఏదో చిన్నపాటి రిజర్వాయర్ అయినా పూర్తి చేస్తే బాగుంటుందని తాను భావిస్తున్నట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పోలవరాన్ని చంద్రబాబు ఎందుకు భుజాలకెత్తుకున్నారని నాడు వైసీపీ ప్రశ్నించిందని ఉండవల్లి గుర్తుచేశారు. మరి, వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రానికి పోలవరం బాధ్యతలు ఎందుకు అప్పగించ లేదని నిలదీశారు. పోలవరం సహా విభజన హక్కులను సాధించుకునే పరిస్థితి ప్రస్తుతం లేదని వ్యాఖ్యానించారు. ప్రధాన పార్టీల అధినేతల ఆస్తులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని.. హెరిటేజ్, భారతి సంస్థల హెడ్ ఆఫీసులు హైదరాబాద్‌లోనే ఉన్నాయని గుర్తు చేశారు. వారి ఆస్తులు హైదరాబాద్‌లో ఉన్నాయి కాబట్టే వైసీపీ, టీడీపీలు విభజన సమస్యలపై పోరాడలేకపోతున్నాయని ఆరోపించారు.
ఈ విషయాలన్నీ చాలా రోజుల నుంచి తాను చెబుతూనే ఉన్నానని.. కానీ, ఎవరూ పట్టించుకోవడం లేదని ఉండవల్లి అరుణ్ అన్నారు. అందుకే తాను ప్రెస్ కాన్ఫరెన్స్‌లు తగ్గించేశానని వివరించారు. ఇక, చంద్రబాబు హయాంలో కనీసం తనను విమర్శించడానికైనా మాట్లాడేవారని.. కానీ, ఇప్పుడు వైసీపీ వాళ్లు ఏం మాట్లాడడం లేదని నిట్టూర్చారు. అయితే, సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక, రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన.. ఈ మూడు పార్టీలూ బీజేపీకి మద్దతిస్తున్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఆ పార్టీల నేతలు వాళ్లలో వాళ్లు తిట్టుకుంటారు కానీ.. బీజేపీని ఒక్క మాట కూడా అనరని వ్యాఖ్యానించారు.