తమిళ పేదలకు చెందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల మీదుగా ఏపీకి తరలిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తమిళనాడు-చిత్తూరు సరిహద్దుల్లోని 7 మార్గాల ద్వారా రైస్ మాఫియా బియ్యం తరలిస్తోందన్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా సరిగా లేకపోవడంతో రైస్ మాఫియా రెచ్చిపోతోందన్నారు. దీనిపై చర్యలు తీసుకోండి అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తమిళనాడు పీడీఎస్ బియ్యంతో ఏపీ రేషన్ రైస్ మాఫియా అక్రమాలను లేఖ ద్వారా స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లారు. తమిళనాడు పీడీఎస్ బియ్యాన్ని ఏపీ రైస్ మాఫియా తరలిస్తోందంటూ సీఎం స్టాలిన్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. ఏయే రూట్లల్లో రేషన్ రైస్ మాఫియా అక్రమంగా రైస్‌ను తరలిస్తోందనే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు.. స్మగ్లర్ల ఫొటోలను స్టాలిన్‌కు రాసిన లేఖకు జత చేసి చంద్రబాబు పంపించారు. అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని ఏపీలో రైస్ మిల్లర్లకు పంపుతున్నారని.. రైస్ మిల్లర్లు బియ్యాన్ని పాలిష్ చేసి రైస్ మాఫియాకు పంపి బహిరంగ మార్కెట్లో ప్రజలకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్నారు.
కొంత మొత్తం కర్ణాటకకు కూడా అక్రమంగా తరలిపోతోందని చంద్రబాబు. తక్కువ ధరకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో కిలో రూ. 40 కు అమ్ముతున్నారని.. దీనికి సంబంధించి నిత్యావసర వస్తువుల చట్టం కింద కుప్పంలో దాదాపు 13 కేసులు నమోదయ్యాయని తెలిపారు. స్థానిక ప్రజలు సైతం చాలా మంది స్మగ్లర్లను పట్టుకుంటున్నా.. కేసులు నమోదు కావడం లేదని.. పీడీఎస్ రైస్ అక్రమ దందా భారీ స్థాయిలో జరుగుతున్నదన్నారు. కావున, తమిళనాడు – ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో నిఘా పెంచాలని సూచించారు. తమిళనాడు ముఖ్యమంత్రి తో పాటు ఇదే అంశం పై చర్యలు కోరుతూ AP రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు.