ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించనున్న టీడీపీ మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. మహానాడు కోసం ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకున్నామని.. అలాగే చలానా కూడా కట్టమన్నారు. చలానా కట్టినా ఇప్పుడు బస్సులు ఇవ్వమని అడ్డు చెబుతున్నారని.. వేసవి రద్దీ అంటూ సాకులు చెప్పడం దారుణమన్నారు. పోనీలు అనుకుని ప్రైవేట్ వాహనాలు తీసుకుందామనుకుంటే వాటి యజమానుల్ని ఆర్టీవోలు భయపెడుతున్నారని చెప్పుకొచ్చారు. మహానాడుకు వాహనాలు ఇస్తే వాటిని సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించార. తాము అలా బెదిరింపులకు గురిచేసిన అధికారుల వివరాలు సేకరించామని.. వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు అచ్చెన్న.
మూడేళ్ల ప్రభుత్వ వ్యతిరేక పాలనపై తిరుగుబాటుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు అచ్చెన్నాయుడు. అందుకే మహానాడును అడ్డుకుని, విజయవంతం కాకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మిని స్టేడియం ఇస్తామని చెబితే అద్దె కూడా చెల్లించామని.. కానీ ఆ తర్వాత ప్రభుత్వ ఒత్తిడితో ఇవ్వడానికి నిరాకరించారన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మహానాడు ఆగదని.. జనం పోటెత్తుతారన్నారు. గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మహానాడుకు శ్రేణులు సమాయత్తమవుతున్నారని చెప్పుకొచ్చారు.