ఓ మహిళ తన భర్తను క్రికెట్ బ్యాట్ తో చితక్కొట్టింది. ఆమె పెడుతున్న టార్చర్ భరించేలేని భర్త రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్కూల్ ప్రిన్సిపల్ అయిన అజిత్ సింగ్ యాదవ్ ఏడేళ్ల కిందట హర్యానాలోని సోనిపట్‌కు చెందిన సుమన్ అనే మహిళను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ సందర్భాల్లో భార్య సుమన్ తన భర్తను పలుమార్లు కిచెన్ వస్తువులు, కర్ర, క్రికెట్ బ్యాట్ వంటి వాటితో కొట్టింది. కొడుకు పక్కనే ఉన్నప్పటికీ అతని ముందే భర్తపై దాడి చేసేది.
మరోవైపు అజిత్ సింగ్ యాదవ్ ఎప్పుడూ తన భార్యను తిరిగి కొట్టలేదు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆయన మహిళ అయిన భార్యపై చేయి చేసుకోవడం తన వృత్తి గౌరవానికి తగదని భావించాడు. దీంతో భార్య పెట్టే గృహ హింసను చాలా కాలం భరించాడు. అయితే తన భార్య తన పరిధులు దాటి దాడులు చేయడాన్ని అజిత్ సింగ్ యాదవ్ సహించలేక పోయాడు. దీంతో భార్య నుంచి రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. ఇంట్లోని సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్‌ను ఆధారాలుగా చూపాడు. దీంతో అతనికి రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు భార్య క్రికెట్ బ్యాట్ తో భర్తను కొడుతున్న సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.