చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ జోరందుకుంది. మామిడి ధరలు తగ్గకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ ఏడీ ఇందుమతి ఆదేశించారు. స్థానిక ఏడీ కార్యాలయంలో మార్కెట్ కమిటీల కార్యదర్శులతో బుధవారం ఆమె సమీక్షించారు. ఏడీ మాట్లాడుతూ మార్కెట్ యార్డుల్లో రోజువారీ మామిడి ధరల వివరాలు నోటీసు బోర్డులో నమోదుతో పాటు అంతర్జాలంలో పొందుపరచాలన్నారు.
యార్డులను శుభ్రంగా ఉంచుకుని మౌలిక వసతులు కల్పించాలన్నారు. మార్కెట్లో మామిడి ధరలు ప్రతిరోజు గమనిస్తూ అవి తగ్గకుండా చూడాల్సిన బాధ్యత కార్యదర్శులదేనని చెప్పారు. మామిడి వ్యాపారులను గుర్తించి కుప్పం, సోమల, పెనుమూరు, వి. కోట యార్డుల్లో వ్యాపార నిర్వహణకు దృష్టిసారించాలన్నారు. ఈ-ఫామ్ విధానంలో మామిడి వ్యాపారాన్ని నిర్వహించి రైతులకు ఆర్ధిక లబ్ధి చేకూర్చాలన్నారు. కమిటీల్లో పెండింగ్ అసెస్‌మెంట్, ఆడిట్ అభ్యంతరాలను సత్వరమే పూర్తి చేయాలన్నారు.
అద్దె బకాయిలు ఈ నెలాఖరులోగా వసూలు చేయాలని చెప్పారు. పక్కాగా మార్కెట్ సెస్‌ను వసూలు చేసి ఆదాయ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.