చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలోని అత్యవసర విభాగంలో వైద్యుల అలసత్వం మరో మారు తేటతెల్లమైంది. నాలుగేళ్ల బాలుడి గొంతులో రూ. 5 బిళ్ల ఇరుక్కుని ఆస్పత్రికి వస్తే వైద్యులు గంటన్నర ఆలస్యంగా పరిశీలించడమే కాక అత్యాధునిక సేవలు లేవని సిఫార్సు చేయడం విమర్శలకు తావిచ్చింది. డీసీహెచ్‌ఎస్ ఉన్న ఆస్పత్రిలోనే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే. కొత్తపల్లిమిట్టకు చెందిన బాలాజీ, అరుణల కుమారుడు రాకేష్(4) బుధవారం ఆడుకుంటూ రూ. 5 బిళ్లను మింగేశాడు. ఆ బిళ్ల గొంతులో ఇరుక్కోవడంతో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి బాలుడిని తీసుకొచ్చారు.
సమయానికి వైద్యులు లేకపోవడంతో బాధితులు గంటన్నర పాటు ఆస్పత్రిలోనే ఎదురుచూశారు. చివరకు వైద్యులు ఆస్పత్రికి వచ్చి బాలుడిని పరిశీలించి, స్కానింగ్ చేసి బిళ్ల గొంతులో ఇరుక్కుందని నిర్ధారించారు. ఆపై స్థానికంగా అత్యాధునిక సేవలు లేవని చెప్పారు. తిరుపతి, లేకుంటే వేలూరు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. గొంతులో బిళ్ల ఇరుక్కున్న బాధతో బాలుడి అరుపులు, వైద్యులు సిఫార్సులను చూసిన తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక తల పట్టుకుని తిరుపతికి పరుగులు తీశారు.