మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. కానీ, ఏ ఒక్కరిలో ఆనందం లేదు. వధూవరులు మాత్రమే సంతోషంగా చిరునవ్వులు చిందిస్తున్నారు. మిగతా వారంతా కన్నీళ్లు దిగమింగుతూ పక్కనే నిలుచున్నారు. అసలు విషయం తెలియని వధూవరులు సంతోషంగా వివాహ తంతును ముగించుకుని నిలబడ్డారు. కాసేపటికే కల్యాణ మండపమంతా ఖాళీ అయిపోయింది. మోపిదేవి మండలం పెదప్రోలు పంచాయతీ శివారు కాసానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. తమవారు చనిపోయారన్న విషయాన్ని దాచి పెద్ద మనసుతో పెళ్లి జరిపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
గురువారం ఉదయం 11.30 గంటలు.. కాసానగర్ వద్ద జరిగిన ప్రమాద స్థలి. ముగ్గురు కుమారులున్నా వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్న 70 ఏళ్ల వయసు కలిగిన కోన వెంకటేశు ఊపిరి ఆగిపోయింది. భర్తను కోల్పోయి, ముగ్గురు కుమారులను సాకుతున్న బూరేపల్లి వెంకటేశ్వరమ్మ విగతజీవిగా మారిపోయింది. మృతులెక్కడో, క్షతగ్రాతులెక్కడో తెలియని భీతావహ దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. అప్పటి వరకు పెళ్లికి వెళ్తున్నామన్న ఆనందమంతా భరించలేని దుఃఖమైపోయింది. బంధువులు, చుట్టుపక్కల వారి రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదకరంగా మారిపోయింది.
కాపాడిన హోర్డింగ్
డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మినీ వ్యాన్ పల్టీకొట్టి కొద్దిదూరం రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి హోర్డింగ్ యాంగ్లర్‌ను పట్టుకుని ఆగింది. హోర్డింగే లేకుంటే మరింత ప్రమాదం జరిగి ఉండేదని తెలుస్తోంది. వాహనం పల్టీ కొట్టడంతో అందులో ఉన్న పెళ్లి బృందమంతా చెల్లాచెదురుగా పడిపోయారు. నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా, ప్రాణాలొదిలారు. చాలామందికి తీవ్రగాయాలయ్యాయి.
రెండు కిలోమీటర్లు దాటితే..లక్ష్మీపురం శివారు చింతలమడ దళితవాడ నుంచి వ్యానులో బయల్దేరిన ఈ పెళ్లి బృందం మరో రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే పెళ్లింటికి చేరుకునేది. ఈలోపే ఈ ఘటన జరిగిపోయింది. మృతిచెందిన వారంతా వ్యవసాయ కూలీలు, రైతులే. డ్రైవర్ నిర్లక్ష్యం ఇంతమంది కుటుంబాలను విషాదంలోకి నెట్టిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.