ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలను ఈసారి రుతుపవనాలు ముందుగానే వచ్చేస్తున్నాయంటూ ఊరించిన వాతావరణ శాఖ మాటమార్చింది. రుతపవనాల రాకపై మరో అప్‌డేట్ ఇచ్చింది.నిన్ననే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని చెప్పిన IMD… ఇపుడు మరింత సమయం పడుతుందని చెబుతోంది. రుతుపవనాలు బలహీనంగా మారే అవకాశం ఉందని, వాటి రాకకు మరో 2-3రోజులు పడుతుందని చెప్పింది. రుతుపవనాలు జూన్ మొదటి వారంలో నెమ్మదిగా పురోగమిస్తాయని వెల్లడించింది.గాలుల స్థిరత్వం, బలం పుంజుకొంటేనే కేరళకు రుతుపవనాలు తాకుతాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. జూన్ 2 నుంచి 8 మధ్య ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణ స్థాయికి చేరుకుంటుందని, మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. మరోవైపు మే 29 వరకు వివిధ జిల్లాలకు ఇచ్చిన ఎల్లో అలర్ట్‌ను కూడా IMD ఉపసంహరించుకుంది.
మరోవైపు అండమాన్ నికోబర్ దీవులను దాటిన రుతుపవనాలు..బలమైన గాలుల ప్రభావంతో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, లక్షద్వీప్, సహా కొమొరిన్ పై విస్తరించి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. వాతావరణ తాజా సూచనల ప్రకారం, దక్షిణ అరేబియా సముద్రం మీదుగా దిగువ స్థాయిలలో పశ్చిమ గాలులు బలపడి లోతుగా మారాయి.
ఉపగ్రహాల చిత్రాల ప్రకారం, కేరళ తీరం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రంపై ఆకాశం మేఘావృతం అయింది. అందువల్ల, రాబోయే మూడు నాలుగు రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.