తన నటనతో, రాజకీయ రంగ ప్రవేశంతో దేశ రాజకీయాలను శాసించిన దివంగత నేత ఎన్టీఆర్ ఖ్యాతి మరోమారు దేశ వ్యాప్తంగా వ్యాపించనున్నది. ఆయన బొమ్మతో రూ.100 నాణెం రాబోతోంది. ఇదిలావుంటే ఎన్టీయార్ శతజయంత్యుత్సవాలు నభూతో న భవిష్యతి అన్న స్థాయిలో నిర్వహించబోతున్నట్లు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. హైదరాబాద్‌లోని ఎన్టీయార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో తన తమ్ముడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో రాఘవేంద్రరావు, రాజేంద్రప్రసాద్ లాంటి సినీ ప్రముఖులు పాల్గొంటారన్నారు.
దివంగత ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించబోతున్నట్లు ఆయన కుమార్తె, భారతీయ జనతా పార్టీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో 100 రూపాయిల నాణెం రాబోతోందన్నారు. రూ. వంద నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రణ గురించి ఇప్పటికే తాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో మాట్లాడుతున్నామని వెల్లడించారు.
జస్టిస్ జాస్తి చలమేశ్వరరావు సహా అనేక మంది ప్రముఖుల సలహాలు, సూచనల మేరకు ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలు ఏడాది పాటు జరుగుతాయని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 12 ప్రధాన నగరాల్లో ఉత్సవాలు జరుగుతాయని, హైదరాబాద్, విజయవాడల్లో మెగా ఈవెంట్స్ ఉంటాయని చెప్పారు. ఉత్సవాల నిర్వహణ పర్యవేక్షణకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కమిటీ సూచనలతో అన్ని రంగాల్లో నిష్ణాతులైన వారిని గుర్తించి, ఘనంగా సత్కరించనున్నట్లు పురంధేశ్వరి వివరించారు.