టీడీపీకి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే బలం. పార్టీకి అండబలమే కాదు ఆర్థిక బలం చేకూర్చడంలోనూ తెలుగు తమ్ముళ్లు ముందుంటారు. తాజాగా మహానాడులో విరాళాలకు సంబంధించి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వచ్చింది. పార్టీకి విరాళాలు ఇవ్వాలని.. కొంత మంది ప్రకటించి, ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఈసారి విరాళం ప్రకటించడం కాదని.. డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే తగిన గుర్తింపునిస్తానని చంద్రబాబు చేసిన ప్రకటన ఫలితాన్నిచ్చింది. తొలిరోజు మహానాడు సందర్భంగా టీడీపీకి భారీగా విరాళాలు వచ్చాయి. గుంటూరుకు చెందిన పార్టీ నాయకుడు మన్నవ మోహనకృష్ణ రూ.31,60,000 విలువైన తాగునీటి బాటిళ్లు అందించారు.
అలాగే, గుంటూరుకు చెందిన టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర (గుంటూరు) పార్టీకి అత్యధికంగా రూ.27 లక్షల విరాళం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, దామచర్ల జనార్దన్ (ఒంగోలు), ఇంటూరి నాగేశ్వరరావు (కందుకూరు) రూ.25 లక్షలు చొప్పున విరాళాలిచ్చారు. ఆర్.శ్రీనివాసరెడ్డి (కడప), పుట్టా సుధాకర్ యాదవ్ (మైదుకూరు), గల్లా జయదేవ్ (గుంటూరు) రూ. 20 లక్షలు చొప్పున విరాళం అందించారు.