కరోనా వైరస్ వచ్చిన తొలినాళ్లలో వాటిని గుర్తించే కిట్ లు లేక ఎంతో ఇబ్బంది పడ్డారు. తాజాగా మంకీ ఫాక్స్ విషయంలో అంతే జరుగుతోంది. తాజాగా వాటి గుర్తింపు కిట్ అందుబాటులోకి వస్తోంది. కరోనా ప్రభంజనం ముగియకముందే.. ప్రపంచాన్ని మంకీపాక్స్ వెంటాడుతుంది. ఇప్పటికే చాలా దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. నిజానికి ఈ వైరస్ కొత్తదేమి కాదు. కాకపోతే ఒకప్పుడు మధ్య, పశ్చిమ ఆఫ్రికాకే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు 20 దేశాలకు పాకింది. అన్ని దేశాల్లోనూ మంకీపాక్స్ వ్యాప్తిపై ఆందోళన పెరుగుతుంది. వైరస్ వ్యాప్తిపై వైద్య నిపుణులు పరిశోధనలు మొదలుపెట్టారు. అయితే మంకీపాక్స్ వైరస్ నిర్ధారణ కోసం మన దేశానికి చెందిన ఒక కంపెనీ టెస్ట్ కిట్‌ను రూపొందించింది.
మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించడం కోసం రియల్ టైమ్ ఆర్‌టీపీసీఆర్ ఆధారిత కిట్‌ను అభివృద్ధి చేసినట్టు చెన్నైకి చెందిన వైద్య పరికరాల సంస్థ ట్రివిట్రాన్ హెల్త్‌కేర్ తెలిపింది. మంకీ ఫాక్స్ రియల్ టైం పీసీఆర్ కిట్ అనేది నాలుగు రంగుల ఫ్లోరో సెన్స్ ఆధారిత కిట్ అని, ఒక ట్యూబ్ సింగిల్ రియాక్షన్ ఫార్మాట్‌లో మశూచి, మంకీపాక్స్ మధ్య తేడాను గుర్తించగలదని కంపెనీ తెలిపింది. ఈ పరీక్షలో వైరస్‌ను గుర్తించేందుకు ఒక గంట సమయం పడుతుందని వెల్లడించింది. ఆ కంపెనీ దానికి సంబంధించి ఒక ప్రకటన చేసింది.
త్రివిట్రాన్ హెల్త్‌కేర్ పరిశోధన, అభివృద్ధి బృందం మంకీ ఫాక్స్ వైరస్‌ను గుర్తించడం కోసం ఆర్టీ పీసీఆర్ ఆధారిత కిట్‌ను అభివృద్ధి చేసింది. అనుమానితుల నమూనాలను సేకరించి కిట్‌లోని వీటీఎం (వైరల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియా)లో ఉంచి పరీక్షించవచ్చని కంపెనీ ప్రకటనలో పేర్కొంది. మంకీపాక్స్ వైరస్ నిర్ధారణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన నమూనా రకాన్ని రోగుల చర్మ గాయాల నుంచి సేకరించి వీటీఎంలో ఉంచి టెస్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇదిలావుంటే ఇప్పటి వరకు 200కిపైగా మంకీపాక్స్ కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. యూరప్, అమెరికా, ఇజ్రాయెల్ వంటి 20 దేశాల్లో కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం తెలిపింది. సరైన చర్యలు తీసుకుంటే వ్యాధిని నియంత్రించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ సిల్వీ బ్రియాండ్ తెలిపారు. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిపై సర్వత్రా ఆందోళన నెలకొందని కూడా అన్నారు. అలాగే మంకీపాక్స్ వైరస్‌కు వ్యాప్తిని అరికట్టేందుకు అందరికీ టీకాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, కానీ వ్యాధి సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారికి టీకాలు అందుబాటులో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు చెప్పారు.
ఇదిలాఉండగా భారతదేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్త డాక్టర్ అపర్ణ ముఖర్జీ తెలిపారు. అయితే మంకీపాక్స్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారు.. జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa