మనం ఒకటి తల్చితే జీవితంలో ఇంకోటి జరుగుతుంది. మనం ఎక్కువ వినే మాటలు. మనం ఎన్ని చేసినా విధి రాత నుంచి తప్పించుకోలేం. అలాంటి ఓ ఘటనను ఇపుడు తెలుసుకోబోతున్నాం. ఆ దంపతులు విడిపోయి చాలా కాలమైంది. వాళ్లు మళ్లీ కలవాలనుకున్నారు. కుటుంబంగా ఒక్కటయ్యారు. కానీ తామొకటి తలిస్తే విధి మరొకటి తలచిందన్నట్టు.. ఎన్నాళ్లకో కలిసిన ఆ దంపతులను శాశ్వతంగా వేరు చేసింది. మళ్లీ కలిసిన శుభ సమయాన ఆ దంపతులు ప్లాన్ చేసుకున్న ట్రిప్ విషాదాంతమైంది. ఇదీ నేపాల్ విమాన ప్రమాదం గురించి వెల్లడైన దిగ్ర్భాంతికర విషయం. ఆ ప్రమాదంలో 22 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వివరాలు..
అశోక్ కుమార్ త్రిపాఠీ (54), ఠాణేకి చెందిన వైభవి బందేకర్ త్రిపాఠీ (51)లు భార్యాభర్తలు. త్రిపాఠీ ఒడిశాలో ఓ కంపెనీని నడిపేవారు. ముంబైలోని బీకేసీలో ఉన్న ఓ సంస్థలో వైభవి జాబ్ చేసేది. అయితే, దాంపత్య జీవితంలో వచ్చిన ఘర్షణల కారణంగా విడాకులు తీసుకున్నారు. దీంతో కుమారుడు ధనుష్ (22), కూతురు రితిక (15)తో కలిసి వైభవి ఠాణేలో విడిగా ఉంటోంది.
అయితే ఆ దంపతులు మళ్లీ కలిశారు. అందరూ కలిసి ఆదివారం నేపాల్ కు ట్రిప్ ప్లాన్ చేశారు. తారా ఎయిర్ లైన్స్ విమానాన్ని బుక్ చేశారు. కానీ, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నేపాల్ లోని ముస్తాంగ్ జిల్లాలోని కొండల్లో ఆ చిన్న విమానం కూలిపోయింది. ఆ విమాన శకలాలను సోమవారం అధికారులు గుర్తించారు. ఇదిలావుంటే ఆ విమానంలో వారితో పాటు ఇద్దరు జర్మన్లు, 13 మంది నేపాలీలు, ముగ్గురు విమాన సిబ్బంది ఉన్నారు. మరోవైపు ఈ ప్రమాదం నుంచి వైభవి తల్లి (80) బయటపడింది. ఆమె ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇంట్లో ఉంచి వెళ్లారు. వైభవి చెల్లెలు ఆమెను చూసుకుంటోంది. ఆమె వెంటిలేటర్ పై ఉండడంతో ప్రమాద వార్త ఇంకా చెప్పలేదు.