ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మమ్మల్నీ ఎంతో బెదిరించాడు...విచారణలో సుబ్రహ్మణ్యం భార్య, తల్లి, సోదరుడి వాగ్మూలం

Crime |  Suryaa Desk  | Published : Wed, Jun 01, 2022, 03:08 PM

రాష్ట్రంలో సంచలనం  రేకెత్తించిన ఎమ్మెల్సీ అనంతబాబు  మాజీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో నిర్ఘాతపోయే విషయాలు  వెలుగులోకి వస్తున్నాయి. సుబ్రహ్మణ్యం భార్య, తల్లి, సోదరుడి వాగ్మూలంను పోలీసు అధికార్లు సేకరించారు.  ‘‘రోడ్డు ప్రమాదంలో మీ కుమారుడు చనిపోయాడు.. రూ.2 లక్షలు ఇస్తా.. మృతదేహాన్ని మీ స్వగ్రామానికి తీసుకెళ్లి దహనం చెయ్యండి.. నేను చెప్పింది వినాలి. లేదంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు ఉరఫ్ అనంత బాబు బెదిరించారని హత్యకు గురైన మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలు, చెయ్యి తీసేస్తానని తమను బెదిరించారన్నారు. ఆ విషయాలను పోలీసులు తమ రిమాండ్‌ రిపోర్టులో పొందుపరిచారు.


మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై తయారు చేసిన రిమాండ్‌ రిపోర్టులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాకినాడలోని ప్రత్యేక మొబైల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌/ఆరో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ముందు మే 23న డీఎస్పీ ఆ రిమాండ్‌ రిపోర్టు ఉంచారు. మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీగా అనంత బాబు ప్రధాన నిందితుడిగా అరెస్టై.. రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే..


ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణలు, నిందితుడి వాంగ్మూలం పరిగణనలోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చడంతో పాటు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, సాక్ష్యాధారాలు తారుమారు చేయడంపైనా దర్యాప్తు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిమాండ్‌ రిపోర్టులో మే 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ నెలకొన్న అన్ని పరిణామాలను పేర్కొన్నారు.


‘‘మే 19న రాత్రి 8.30 గంటలకు ఎమ్మెల్సీ అనంతబాబు నా భర్తకు ఫోన్‌ చేశాడు. తర్వాత నాతో కూడా మాట్లాడాడు. నీ కొడుకు నాకు రూ. 20 వేలు ఇవ్వాలి కదా. ఇవ్వడా, నాకు డ్రైవర్‌ లేడు. వాడు పని మానేశాడు. వెంటనే డబ్బులు ఇచ్చేయమని చెప్పు లేకపోతే కాలు, చెయ్యి తీసేస్తా..’ అని బెదిరించాడని పోలీసులకు సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం చెప్పారు. అనంతబాబు రహస్యాలు తన కొడుకు బయటపెడితే ఇబ్బంది అవుతున్న కారణంతో కొందరితో కలిసి చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని ఆరోపించారు.


ఎమ్మెల్సీ రహస్యాలు తన కొడుక్కి తెలుసనే కక్షతో మరికొందరితో కలిసి బీచ్‌కు తీసుకెళ్లి కొట్టి అనంతబాబు, అతని అనుచరులు కొట్టి చంపారని సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ చెప్పారు. తన సోదరుడి మరణానికి కారణం అడిగితే.. ‘‘అదంతా నీకు అనవసరం.. రూ. 2 లక్షలు ఇస్తాను మీ ఊరు తీసుకెళ్లి అంత్యక్రియలు చేయండి. ఒక్కొకటి అలా జరుగుతుంటాయి’’ అని ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరించారని సోదరుడు నవీన్‌ వాంగ్మూలం ఇచ్చారు.


తన భర్త మరణానికి కారణం ఏంటని అడిగితే ‘‘నేను చెప్పినట్లు చెయ్యకపోతే నీ మరిదిని కూడా చంపుతాను’’ అని ఎమ్మెల్సీ బెదిరించాడని.. ఈలోగా మా బంధువులు అక్కడికి రావడంతో అనంతబాబు తన భర్త శవాన్ని కారులో వదిలి పారిపోయాడని సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ డీఎస్పీకి నివేదించారు. ప్రస్తుతం నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం ఎమ్మెల్సీ అనంతబాబు నేరం చేసినట్లుగా ప్రాథమికంగా స్పష్టమవుతోందని పోలీసులు తమ రిపోర్టులో వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com