తాజా పరిస్థితుల్లో బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలంటే రుణగ్రహితులు భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా అన్ని బ్యాంకులు తాము ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు అమాంతంగా పెంచాయి. దీంతో లోన్ మాట ఎత్తడానికి రుణగ్రహితులు భయపడుతున్నారు. రుణ గ్రహీతలకు అలర్ట్. బ్యాంకులు వరుసగా పెట్టి రుణ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి. చాలా బ్యాంకులు ఇప్పుడు ఎస్‌బీఐ దారిలో నడుస్తున్నాయి. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, పీఎన్‌బీ బ్యాంక్ వంటివి కూడా రుణ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీని వల్ల బ్యాంక్ నుంచి హోమ్ లోన్ వంటివి తీసుకున్న వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. అలాగే కొత్తగా లోన్ తీసుకోవాలని భావిస్తే.. అధిక వడ్డీ రేటు చెల్లించుకోవాల్సి వస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీని వల్ల ఈఎంఐ భారం పెరగనుంది. హౌసింగ్ లోన్స్‌పై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (ఆర్‌పీఎల్ఆర్) 5 బేసిస్ పాయింట్లు పెంచినట్లు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. జూన్ 1 నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. దీంతో ఇప్పుడు హోమ్ లోన్ వడ్డీ రేటు 7.05 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. గత నెల రోజుల కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ రుణ రేట్లు పెంచడం ఇది మూడో సారి కావడం గమనార్హం.
ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రుణ రేట్లు పెంచేశాయి. మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటును పెంచాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్‌ను 15 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచే ఈ కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. దీంతో ఏడాది ఎంసీఎల్ఆర్ 7.4 శాతానికి చేరింది. ఎంసీఎల్ఆర్ ఓవర్‌నైట్‌కు 6.75 శాతంగా, నెల రోజులకు 6.8 శాతంగా, మూడు నెలలకు 6.9 శాతంగా, ఆరు నెలలకు 7.1 శాతంగా, మూడేళ్లకు 7.7 శాతంగా ఉంది.
ఐసీఐసీఐ బ్యాంక్ విషయానికి వస్తే.. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.55 శాతంగా ఉంది. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 7.3 శాతంగా, నెల రోజుల ఎంసీఎల్ఆర్ 7.3 శాతంగా, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 7.35 శాతంగా, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.5 శాతంగా కొనసాగుతోంది. ఈ రేట్లు జూన్ 1 నుంచి వర్తిస్తాయి. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎంసీఎల్ఆర్‌ను జూన్ 1 నుంచి పెంచేసింది. ఈ బ్యాంక్‌లో ఏడాది ఎంసీఎల్ఆర్ 7.35 శాతంగా ఉంది. దీని వల్ల ఎంసీఎల్ఆర్ ప్రాతిపదికన లోన్ తీసుకున్న వారిపై ప్రభావం పడుతుంది.