ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీర్యధానం చేసిన వ్యక్తి ..చివరకు అలా చేశాడు

international |  Suryaa Desk  | Published : Thu, Jun 02, 2022, 04:30 AM

వీర్యధానం ఒక్కోసారి అనర్థాలకు దారితీస్తుంది. అలాంటి ఘటనే తాజాగా ఇటీవల చోటు చేసుకొంది. సోషల్ మీడియా ద్వారా వీర్యదానం గురించి ప్రచారం చేసి 15 మంది పిల్లలకు తండ్రయిన ఓ వ్యక్తి వారసత్వంగా సంక్రమించిన జన్యుపరమైన లోపం గురించి మహిళలకు నిజం చెప్పలేదు. మానసిక, శారీరక వైకల్యానికి కారణమయ్యే సిండ్రోమ్‌తో అతడు బాధపడుతున్నట్టు ది ఇండిపెండెంట్ కథనం తెలిపింది. యూకేకు చెందిన 37 ఏళ్ల జేమ్స్ మెక్‌డూగల్ ఫ్రాగిల్ ఎక్స్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారని తెలిసినప్పటికీ వీర్యదానం చేశాడు. వారసత్వంగా సంక్రమించే ఈ సిండ్రోమ్ కారణంగా తక్కువ ఐక్యూ, పిల్లల్లో మానసిక ఎదుగుదల జాప్యానికి దారితీస్తుంది.


ఇటీవల తన నలుగురు పిల్లల బాధ్యతను అప్పగించాలని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేయడంతో మెక్‌డూగల్ గుర్తింపు బయటపడింది. వీర్యదానం చేసినా ఆ పిల్లలతో తనకు సంబంధం ఉండదని ఒప్పందంపై మెక్‌డూగల్ మొదట సంతకం చేసినప్పటికీ కోర్టుకు వెళ్లడం గమనార్హం. అతడి పిటిషన్‌పై డెర్బీ క్రౌన్ కోర్టు విచారణ చేపట్టింది.


ప్రైవేట్ వీర్య దాతల ద్వారా పిల్లలను కనాలని భావిస్తున్నవారి హక్కుల రక్షణ కోసం ఈ పిటిషన్‌ను విచారణకు న్యాయమూర్తి అనుమతించారు. కుటుంబ న్యాయస్థానాలలో అజ్ఞాత తల్లిదండ్రుల వివరాలను గోప్యంగా ఉంచడం సాధారణ విధానం కాబట్టి పిల్లల గుర్తింపునకు రక్షణ ఉంటుందని న్యాయమూర్తి అన్నారు. అయినప్పటికీ, మెక్‌డూగల్ పేరు వెల్లడించడానికి ‘బలమైన కారణాలు’ ఉన్నాయని, భవిష్యత్తులో వీర్యదాతగా నిరోధించడమే ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.


ప్రిసైడింగ్ జడ్జి జస్టిస్ లీవెన్ ప్రకారం.. ‘‘లెస్బియన్ మహిళల కోసం సోషల్ మీడియాలో వీర్యదానం గురించిన ప్రకటన ఇచ్చాడు.. తన ఆరోగ్య పరిస్థితి కారణంగా క్లినిక్‌కి వెళ్లలేనని తెలిసీ వీర్యదాతగా వ్యవహరించి ప్రాథమిక బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించాడు.. పిల్లలను కనాలనే మహిళల కోరికను అతను సద్వినియోగం చేసుకున్నాడు’’ అని తెలిపారు. మెక్‌డూగల్‌ను ‘సంక్లిష్ట పాత్ర’గా అభివర్ణించిన న్యాయమూర్తి.. తక్కువ ఐక్యూ కారణంగా నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడని చెప్పారు.


బీబీసీ ప్రకారం.. వీర్యదానం చేయడానకి ముందు ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ మెక్‌డూగల్ తన మొదటి బిడ్డను అక్టోబర్ 2019, మార్చి 2020 మధ్య కలిశారని కోర్టు పేర్కొంది. అయితే, ఒప్పంద పత్రం చాలా చట్టబద్ధమైన భాషలో ఉందని, ఇది న్యాయవాదికి కూడా చదవడం కష్టమని న్యాయమూర్తి అన్నారు. ఇంకా తనకు ఫ్రాగిల్ ఎక్స్ సిండ్రోమ్‌ ఉన్నట్లు అంగీకరించాడు కానీ దాని గురించి వివరణ ఇవ్వలేదని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com