సహజంగా ఇంటి బాధ్యత, ఇంట్లో వాళ్ల బాధ్యత అంతా మహిళలపైనే ఉంటుంది గనుక.. వారు ఎక్కువ దృష్టి పెడుతుంటారు. ఇంటి పరిశుభ్రత నుంచి ఇంట్లో అందరూ తీసుకునే ఆహారం వరకూ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎవరూ ఎటువంటి అనారోగ్యాలకు గురికారు. ఇంట్లో చాలామంది తగినన్నీ మంచి నీళ్లు తాగరు. నీళ్లు తాగకపోవడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. చర్మ వ్యాధులు, అర్జీలు వస్తుంటాయి. అందుకే ఇంట్లో అందరూ రోజు తగినన్నీ నీళ్లు తాగేలా చూసుకోవాలి. నీళ్లు తాగడంపై అవగాహన పెంచాలి.
అలాగే ఇంట్లో చిన్ని పిల్లలుంటే.. వారిలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు అన్ని రకాల పోషకాలు అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా జింక్, ఐరన్, క్యాల్షియం వంటి ఖనిజాలు మాంసకృతులు ఇమ్యూనిటీని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ఉండేలా వారి తీసుకునే భోజనంలో కూరగాయలు, ఆకు కూరలు, గుడ్లు, పండ్లు , పాలు నట్స్, పొట్టుతో ఉన్న ధాన్యాలు అన్ని ఉండేలా ప్లాన్ చేయాలి. అలాగే అన్ని రకాల పండ్లు తినేలా పిల్లలను ప్రోత్సహించాలి. ఇంట్లో వచ్చే దుర్వాసలు కూడా అనారోగ్యానికి కారణాలవుతాయి. ఇల్లు ఎప్పుడు ఫ్రెష్‌గా ఉండేలా, సువాసనలు వెదజల్లేల చూసుకోవాలి. ఒక్కోసారి ఫ్రిజ్ ఘాటు వాసనలతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు నారింజ, బత్తాయి, కమలా, నిమ్మ పండ్ల్ తొక్కల పొడిని చెంచా తీసుకుని, కాస్త ఉప్పుని చేర్చి ఓ గిన్నెలోవేసి ఓ మూల ఉంచితే ఆహార పదార్థాల వాసనలని పీల్చుకుంటుంది. అలాగే చెత్తబుట్టలో అడుగున నాలుగైదు ఎండిన నిమ్మ, నారింజ తొక్కల్ని వేస్తే దుర్వాసన రాదు .
అలాగే ఇంట్లోకి పురుగు, పుట్ర రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అవి వండుకునే ఆహార పదార్థాలపై పడి వివిధ వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది. ఒక వేళ ఇంట్లో బొద్దింకల సమస్య ఉంటే.. పావుకప్పు చొప్పున మౌత్‌వాష్, నీళ్లు, బేకింగ్‌సోడా స్ప్రే బాటిల్‌లో వేసి బాగా కలిపి, దీన్ని బొద్దింకలు ఉన్న చోట చల్లి రాత్రంతా వదిలేయాలి. పుదీనాని ఎండబెట్టి పొడి చేసి దానికి కాస్త వంటసోడా నీళ్లు కలిపి మూలల్లో పెడితే వాటి సమస్య దూరమవుతుంది. కాఫీ పొడిని పల్చని వస్త్రంతో చిన్నచిన్న మూటలు కింద కట్టి, వాటిని బొద్దింకలు తిరిగే చోట ఉంచితే ఆ ప్రదేశానికి రావు. అలానే బిర్యానీ ఆకుని పొడి చేసి దానికి కాస్త వెనిగర్, వంటసోడా కలిపి మొక్కల దగ్గర పెడితే... చీడపీడల సమస్య ఉండదు.